ENG vs SCOT T20 World Cup Highlights: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో ఇంగ్లండ్‌-స్కాట్లాండ్‌(ENG vs SCOT) మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయింది. భారీ వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. టాస్ ముగిసిన తర్వాత బార్బడోస్‌లో వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్‌ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. పవర్‌ప్లే తర్వాత మరోసారి భారీ వర్షం కురిసింది. స్కాట్లాండ్ 6.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులకు చేరుకున్న దశలో భారీ వర్షం కురరిసింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో మ్యాచ్‌ను 10 ఓవర్లకు కుదించారు.

 

దంచేసిన స్టాట్లాండ్‌ ఓపెనర్లు

వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ పది ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ స్కాట్లాండ్‌  ఓపెనర్లు పది ఓవర్లలోనే 90 పరుగులు చేసి సంచలనం సృష్టించేలా కనిపించారు. పవర్‌ ప్లే లోనే స్కాట్లాండ్‌ ఓపెనర్లు మైఖేల్‌ జోన్స్‌- జార్జ్‌ మున్సే 51 పరుగులు జోడించారు. మైఖేల్ జోన్స్ 30 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, జార్జ్ మున్సే 31 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్కాట్లాండ్‌ బ్యాటర్లు ఇద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో స్కాట్లాండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. స్కాట్లాండ్ 6.2 ఓవర్ల వద్ద ఆడుతుండంగా ఒకసారి వర్షం రావడంతో ఆటను నిలిపేశారు. స్కాట్లాండ్‌ పది ఓవర్లకు 90 పరుగులు చేసిన దశలో మరోసారి వాన కురవడంతో మ్యాచ్‌ను నిలిపేశారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌  లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో పది ఓవర్లలో 109 పరుగులుగా నిర్దేశించారు. స్కాట్లాండ్‌ ఓపెనర్లను డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ బౌలర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. క్రిస్ జోర్డాన్  రెండు ఓవర్లలోనే 24 పరుగులు ఇవ్వగా... అదిల్‌ రషీద్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగలుు ఇచ్చాడు. వీరిద్దరిని లక్ష్యంగా చేసుకుని స్కాట్లాండ్‌ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్‌ బౌలర్లు బంతిపై నియంత్రణ కోల్పోయారు. ఇంగ్లండ్ బౌలింగ్ దళం... స్కాటిష్ ఓపెనింగ్ జోడిని ఇబ్బంది పెట్టలేకపోయింది. మార్క్‌ వుడ్ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి వికెట్‌ ఏమీ తీయకుండా 11 పరుగులు ఇవ్వగా.... జోఫ్రా ఆర్చర్‌ రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి 12 పరుగులు చేశాడు. మొయిన్‌ అలీ రెండు ఓవర్లలో 15 పరుగులు ఇచ్చాడు.

ఇంగ్లండ్‌కు నష్టమేనా

స్కాట్లాండ్‌తో జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం ఇంగ్లండ్‌కు నిరాశను మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఖాతాలో రెండు పాయింట్లు వేసుకోవాలని వ్యూహాలు రచించిన ఇంగ్లండ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. పసికూనతో జరగాల్సిన మ్యాచ్‌తో తేలిగ్గా రెండు పాయింట్లు వస్తాయని ఇంగ్లండ్‌ భావించింది. కానీ వర్షం బ్రిటీష్‌ జట్టుకు ఆ అవకాశం లేకుండా చేసింది. 

 

తదుపరి మ్యాచులు

స్కాట్లాండ్ తన తదుపరి మ్యాచ్‌లో కెన్సింగ్టన్ ఓవల్‌లో నమీబియాతో తలపడనుంది. ఇంగ్లండ్ శనివారం అదే వేదికపై చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో పోటీకి సిద్ధమవుతుంది.