అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ 2026ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా ఫిబ్రవరి 7న USAతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. అదే టోర్నమెంట్‌లో అంతా ఆసక్తిగా ఎదురు చూసే మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య పోరు. దాయాదుల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. 

Continues below advertisement

T20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరుగుతుందని ఐసీసీ తెలిపింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫిబ్రవరి 7న ముంబైలో USAతో తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో భారత్ లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.  

2026 T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరుగుతుంది. ఫైనల్‌కు పాకిస్తాన్ జట్టు అర్హత సాధిస్తే కనుక టైటిల్ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. అదేవిధంగా వరల్డ్ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ముంబైలో ఆడాల్సి ఉంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటే కనుక కొలంబోలో ఆ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Continues below advertisement

మొత్తం 20 జట్లు, 8 వేదికల్లో మ్యాచ్‌లు 

2026 T20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొనున్నాయి. తొలిసారిగా ఇటలీ ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. ICC అధ్యక్షుడు జై షా టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల చేయడం తెలిసిందే. T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు మొత్తం 8 వేదికల్లో జరుగుతాయని చెప్పారు. టోర్నమెంట్ మ్యాచ్‌లు భారతదేశంలో 5 వేదికల్లో జరుగుతాయి. శ్రీలంకలోని మూడు వేదికల్లో సైతం మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. భారతదేశంలో టోర్నమెంట్ మ్యాచ్‌లు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో జరుగుతాయి. అదే సమయంలో కొలంబో, క్యాండీలలో శ్రీలంకలో  T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతాయి.

2026 T20 ప్రపంచ కప్‌లో ఇండియా షెడ్యూల్ (India T20 World Cup 2026 Schedule)

-  భారత్ vs అమెరికా, ఫిబ్రవరి 7, ముంబై వేదికగా మ్యాచ్-  భారత్ vs నమీబియా, ఫిబ్రవరి 12, ఢిల్లీ-  భారత్ vs పాకిస్తాన్, ఫిబ్రవరి 15, కొలంబోలో మ్యాచ్-  భారత్ vs నెదర్లాండ్స్, ఫిబ్రవరి 18, అహ్మదాబాద్

2 సార్లు T20 ప్రపంచ కప్ గెలిచిన భారత్ 

టీమిండియా 2 సార్లు T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. వెస్టిండీస్ జట్టు సైతం రెండు సార్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతగా నిలిచింది. భారత జట్టు మొదట 2007లో తొలి T20 ప్రపంచ కప్‌ సాధించింది. అప్పుడు MS ధోని కెప్టెన్సీలో ఇండియా ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి కప్పు అందుకుంది. ఆ తర్వాత 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. 17 ఏళ్ల తరువాత భారత్‌కు పొట్టి ప్రపంచ కప్ లభించింది. ఓటమి ఎరుగని జట్టుగా భారత్ అప్రతిహత విజయాలతో 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన క్షణాలను భారతీయులు మరవరు. అనంతరం ముంబైలో టీమిండియా ఆటగాళ్ల పరేడ్ ఘనంగా నిర్వహించారు.