India T20 World Cup Squad 2024: జూన్‌లో జరిగే టీ-20 ప్రపంచకప్‌(T20 World Cup)నకు భారత్‌ జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టును ఎంపిక చేసింది. రోడ్డు ప్రమాదం తర్వాత ఐపీఎల్‌ అదగొడుతూ ఫామ్‌ను, ఫిటినెస్‌ను నిరూపించుకున్న రిషబ్‌ పంత్‌ తిరిగి జట్టులోకి పురాగమనం చేశాడు.


ఐపీఎల్‌లో సత్తాచాటుతోన్న శివమ్‌ దుబే, యజ్వేంద్ర చాహల్‌ సైతం తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషాన్‌లకు  సెలక్టర్లు మెుండి చేయి చూపారు.ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా వైస్‌ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. రోహిత్‌తో పాటు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు. కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కింది. వికెట్‌ కీపర్‌గా పంత్‌తో పాటు సంజు శాంసన్‌ ఎంపికయ్యాడు. ఆల్‌రౌండర్‌ విభాగంలో దుబే, జడేజా, అక్షర్‌ పటేల్‌లకు చోటు లభించింది. స్పిన్నర్లుగా కుల్‌దీప్‌, చాహల్‌ ఎంపికయ్యారు. పేస్‌ భారాన్ని జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌, సిరాజ్‌లు మోయనున్నారు. శుభమన్‌ గిల్‌, రింకూసింగ్‌, ఖలీల్‌ అహ్మాద్‌, అవేశ్‌ ఖాన్‌లు..స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపికయ్యారు.  






భారత టీ 20 జట్టు  :


రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ),సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), హార్దిక్  పాండ్య (వికెట్ కీపర్ ), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా,  ముహమ్మద్ సిరాజ్,


ట్రావెలింగ్ రిజర్వ్‌(స్టాండ్ బై ): శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్‌, అవేశ్‌ఖాన్‌


అంబాసిడర్‌ గా ఉసేన్ బోల్ట్


క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)  జూన్‌ 1 నుంచి  ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌ కప్‌కు యూఎస్‌, వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతంప్రతీ  దేశం తమ వరల్డ్‌ కప్‌ టీమ్‌ల ఎంపికలో బిజీగా ఉన్నాయి.  మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024 ప్రచారకర్తగా జమైకన్ పరుగుల చిరుత, ఒంలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఉసెన్ బోల్ట్‌( Usain Bolt)ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నియమించింది. అమెరికాలో క్రికెట్ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ఐసీసీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీంతో తన స్పీడ్‌తో ఒలింపిక్స్‌లో  8 సార్లు బంగారు పతకాలు సాధించిన జమైకా స్పీడ్‌స్టర్ ఉసేన్ బోల్ట్‌ను టీ20 ప్రపంచకప్ అంబాసిడర్‌గా నియమించారు. బోల్డ్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేయడం వల్ల, టీ20 వరల్డ్‌కప్‌ మరిన్ని దేశాలకు పరిచయం అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. 


తొలి మ్యాచ్ అమెరికాతో కెనడా 


జూన్‌ 1 నుంచి  ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. అమెరికాలో 3, వెస్టిండీస్‌లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి.  తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Team India), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో, 12న అమెరికాతో, 15న కెనడాతో తలపడనుంది.