T20 WC, India vs England semi-final 2:  సమరానికి సిద్ధంగా ఇరు జట్లు... ఏ విభాగంలో చూసినా పటిష్టంగా ఇరు సేనలు... టైటిల్‌ కలను నెరవేర్చుకునేందుకు కేవలం రెండే అడుగుల దూరంలో అగ్ర జట్లు..బ్యాటింగ్‌ పరంగా చూసినా...బౌలింగ్‌ను అంచనా వేసినా... మైదానంలో దూకుడు చూసినా ఇరు జట్లు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఇరు జట్లు సెమీస్‌ సమరానికి సిద్ధమయ్యాయి. గత టీ 20 ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు టీమిండియా(India) సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా(AUS) చేతిలో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్‌... ఇక ఇంగ్లండ్‌(ENG) పని పట్టేందుకు సిద్ధమైంది. రోహిత్‌ సేన దూకుడు చూస్తే బ్రిటీష్‌ జట్టుకు అంత తేలిక కాదు. కానీ బట్లర్‌ సేనను తక్కువ అంచనా వేస్తే మళ్లీ నిరాశ ఎదురవ్వక తప్పదు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ ఎలా ఆడతాడన్న దానిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎందుకంటే గత మూడు ఐసీసీ ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో విరాట్‌ అర్ధ సెంచరీలు చేశాడు. మరోసారి విరాట్‌ గర్జిస్తే ఇక టీమిండియాకు తిరుగే ఉండదు. ఎందుకంటే బౌలింగ్‌లో భారత్ అదరగొడుతుంది. ఇక బ్యాటింగ్‌లో కూడా రోహిత్‌ను అనుసరిస్తే భారత జట్టుకు తిరుగుండదు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-ఇంగ్లాండ్ ఇప్పటివరకూ 4 మ్యాచులు ఆడగా... అందులో రోహిత్‌ సేన రెండు, బ్రిటీష్‌ జట్టు రెండు మ్యాచులు గెలిచాయి. ఇప్పటివరకూ ఇరు జట్లు 23 మ్యాచులు ఆడగా... 12 మ్యాచుల్లో భారత్‌.... 11 మ్యాచుల్లో ఇంగ్లాండ్‌ గెలిచాయి. వీటిని బట్టి ఇరు జట్లు ఎంత సమఉజ్జీలుగా తెలుస్తాయో అర్థమవుతుంది. 




 

టీమిండియా బలంగా

బ్యాటింగ్‌లో టీమిండియా పర్వాలేదనిపిస్తున్నా బౌలింగ్‌ మాత్రం చాలా బలంగా కనిపిస్తోంది. కానీ గత మ్యాచ్‌లో భారత విజయాన్ని ఏకపక్షంగా మార్చేసిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... భీకర ఫామ్‌లోకి తిరిగి రావడం టీమిండియాకు కలిసి రానుంది. రోహిత్‌ మరోసారి దూకుడుగా ఆడితే ఇంగ్లాండ్‌కు కష్టాలు తప్పవు. విరాట్‌ కోహ్లీ కూడా జోరు అందుకుంటే బ్యాటింగ్‌లో తిరుగుండదు. గత మూడు ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో అర్ధ సెంచరీలతో కదం తొక్కిన విరాట్‌... మరోసారి టచ్‌లోకి వస్తే ఇంగ్లాండ్‌పై విజయం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే విరాట్ మినహా మిగిలిన బ్యాటర్లంతా రాణిస్తుండడం టీమిండియాకు అనుకూలంగా మారనుంది. రోహిత్‌, విరాట‌్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లతో బ్యాటింగ్‌ విభాగం బలంగా కనిపిస్తోంది. బుమ్రా, అర్ష్‌దీప్‌, హార్దిక్‌ పాండ్యా కుల్‌దీప్‌లు ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్‌తో పోలిస్తే హార్దిక్‌ పాండ్యా చాలా బాగా ఆడుతుండడం టీమిండియాకు కలిసి రానుంది. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌ చేరాలని పట్టుదలగా ఉన్న భారత్‌... వచ్చిన ఏ  అవకాశాన్ని వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేదు.

 

ఇంగ్లాండ్‌ను తక్కువగా చూడలేం

ఈ వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పెద్దగా రాణించకపోయినా వారిని తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే తమదైన రోజున బ్రిటీష్‌ జట్టు అద్భుతాలు చేస్తుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన బ్రిటీష్‌ జట్టు.... చిన్నజట్లపై మాత్రం ఘన విజయాలు నమోదు చేసింది. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు బట్లర్, ఫిల్ సాల్ట్... వీళ్లిద్దరే బ్రిటీష్‌ జట్టుకు సగం బలం. వీళ్లదరిని ఎంత త్వరగా అవుట్‌ చేస్తే భారత విజయ శాతం అంత పెరుగుతుంది. బెయిర్ స్టో పెద్దగా రాణించట్లేదు. హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, శామ్ కర్రన్‌లు కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేయగలరు. చివరి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ మనల్ని 10వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు దానికి ప్రతీకారాన్ని టీమిండియా తీర్చుకోవాల్సిందే.