Afghanistan Trained In India For T20 World Cup | అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టి ఆఫ్ఘనిస్తాన్ సంచలనమే సృష్టించింది. న్యూజిలాండ్‌తో పాటు పొట్టి ప్రపంచ కప్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా లాంటి జట్లను అఫ్గాన్ లాంటి చిన్న టీమ్ అసలు ఎలా ఓడించిందంటూ క్రికెట్ ప్రేమికులతో పాటు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. అయితే ఆఫ్గాన్ ఆటగాళ్ల అద్వితీయమైన ప్రతిభను గుర్తించి వాళ్లకు అండగా నిలిచింది భారత్. అదేనండీ భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI). 


వాస్తవానికి సభ్య దేశాల్లో, అసోసియేట్ దేశాల్లో, చిన్న దేశాల్లో క్రికెట్ ను ఐసీసీనే ప్రోత్సహించాలి. కానీ పొరుగు దేశం అఫ్గాన్ క్రికెట్ సంబంధించి బాధ్యతలను ఐసీసీలో చక్రం తిప్పే బీసీసీఐ తీసుకుంది. తాలిబన్ల ప్రభుత్వంలో కఠినమైన ఆంక్షల మధ్య ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ ఆడేందుకు ఒక్క ఇంటర్నేషనల్ స్టేడియం కూడా లేదు. మరి ప్రాక్టీస్ ఎలా చేస్తారు. బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలంటే.. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లతో తలపడాలంటే వారికి కనీస వసతులు ఉండాలి కదా. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్స్ ను ఓడించాలంటే వసతులు మాత్రమే కాదు, ప్రాక్టీస్ చేయడానికి స్టేడియం కూడా అవసరం. 


సరిగ్గా ఇక్కడే భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ, ఆఫ్గాన్ క్రికెట్ బోర్డుకు సరైన సమయంలో సహాయం అందించింది. భారత్ లోని 3 క్రికెట్ స్టేడియాలను ఆఫ్గనిస్థాన్ క్రికెట్ టీమ్‌కు, బోర్డుకు బీసీసీఐ కేటాయించింది. ఒకటి గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్టేడియం కాగా, రెండోది లక్నోలోని ఎకానా స్టేడియం. మూడోది డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఆ దేశంలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకుగానూ 2015 నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు ఆ మూడు స్టేడియాలను హోమ్ గ్రౌండ్స్‌గా మార్చేసింది. అఫ్గాన్ క్రికెటర్లు ఈ స్టేడియాల్లోనే ప్రాక్టీస్ చేసుకుంటారు. వేరే దేశాల జట్లతో సిరీస్ లు ఉంటే అఫ్గాన్  టీమ్ అక్కడే ఆడుతుందని తెలిసిందే. 


ఈ టీ20 వరల్డ్ కప్ ముగిసిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ జులై 25 నుంచి బంగ్లాదేశ్ తో మూడు వన్డేలు, మూడు టీ2౦ మ్యాచులు ఇదే వేదికలో ఆడనుంది. అది జరిగేది ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలోని స్టేడియంలోనే. అలా గత 8, 9 ఏళ్ల నుంచి తీవ్రంగా శ్రమించిన అఫ్గాన్ టీమ్ తొలుత ఇతర చిన్న జట్లకు పోటీ ఇచ్చింది. ఆపై వాటిని ఓడించింది. ఆపై వీలు చిక్కినప్పుడల్లా సంచలనాలు నమోదు చేసింది. అలా ప్రపంచ ఛాంపియన్, మాజీ ఛాంపియన్లను ఓడించే స్థాయికి తొమ్మిది సంవత్సరాల్లోనే ఆఫ్గాన్ క్రికెట్ ఎదిగింది. అయితే అఫ్గాన్ క్రికెట్ టీమ్ ఎదుగుదలకు భారత ఆ విధంగా సాయం అందిస్తోంది. 



టీమిండియా ఫ్యాన్స్ కూడా ఆఫ్గాన్ టీమ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. భారత విజయాన్ని అఫ్గాన్ టీమ్, ఆ దేశ ప్రజలు ఆస్వాదిస్తుంటారు. పాకిస్తాన్, బంగ్లా దేశ్ లపై ఆఫ్ఘనిస్తాన్ టీమ్ సంచలన విజయాలు సాధించినప్పుడు మన దేశ ప్రజలు సైతం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌లు నెగ్గకముందే అతిగా ప్రవర్తించే బంగ్లాను ఓడించినా, ఆస్ట్రేలియాను ఇంటి బాట పట్టించినా.. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి కసి తీర్చుకున్నట్లు భారతీయులు ఫీలయ్యారు.


అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పటి అఖండ భారతావనిలో భాగం. ఈ ఆఫ్గాన్ ఒకప్పటి మన దేశంలోని గాంధార రాజ్యం. అఖండ భారత్ లో భాగమే కదా అంటూ అఫ్గాన్ జట్టు విజయాల్ని ఆస్వాదిస్తూ వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. గురువారం జరగనున్న తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి.