T20 World cup Records Most wickets:  టీ20 ప్రపంచకప్‌(T20 World Cupలో జయాపజయాలను నిర్ణయించేది బౌలింగే. పొట్టి ఫార్మాట్‌లో హిట్టర్లను అడ్డుకోవాలంటే బలమైన బౌలింగ్ వనరులు లేకుండా సాధ్యంకాదు. దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టి టీ20 ప్రపంచకప్‌లో రికార్డులు నెలకొల్పిన బౌలర్లు చాలా మందే ఉన్నారు.


బౌలింగ్ మొదలెడితే  వికెట్ పడిపోవాలంతే .. 


వేస్తే పడి పోవాలంతే.. అన్నట్టు బౌలింగ్ లో అగ్రస్థానంలో ఉన్నది బంగ్లాదేశ్‌ లెఫ్ట్ ఆర్మ్‌ స్పిన్నర్ షకీబుల్ హసన్(Shakib Al Hasan). 37 ఏళ్ల షకీబ్ 36 మ్యాచ్‌లు ఆడి 35 ఇన్నింగ్స్‌ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. 6.78 ఎకానమీతో షకీబ్ రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. ఈసారి కూడా బంగ్లా జట్టులో చోటు దక్కించుకున్న ఈ వెటరన్‌ ఆటగాడు మరెన్ని వికెట్లు సాధిస్తాడో వేచి చూడాలి.


షకీబ్ తర్వాత స్థానం పాకిస్థాన్ ఆల్‌రౌండర్‌ షహీద్ ఆఫ్రిదీ(Shahid Afridi ) పేరిట ఉంది. 2007 నుంచి 2016 వరకూ టీ20 ప్రపంచకప్‌లో 34 మ్యాచ్‌లలో 39 వికెట్లు పడగొట్టాడు ఆఫ్రిదీ. తరువాత  పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ టేకర్లలో మూడో స్థానం శ్రీలంక వినూత్న పేస్ బౌలర్‌ లసిత్ మలింగదే(SL Malinga). తనదైన బౌలింగ్ స్టైల్‌తో 2007 నుంచి 2014 వరకూ ఆడిన మలింగ 38 వికెట్లు పడగొట్టాడు. నాలుగో స్థానం పాకిస్థాన్‌ ఆఫ్ బ్రేక్ బౌలర్ సయీద్ అజ్మల్‌(Saeed Ajmal)ది. 2009 నుంచి 2014 వరకూ టీ20 ప్రపంచకప్ లో పాక్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అజ్మల్… 23 మ్యాచ్‌లలో 36 వికెట్లు పడగొట్టాడు. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల రికార్డుల్లో ఐదో స్థానంలో శ్రీలంక ఆఫ్ బ్రేక్ బౌలర్ అజంతా మెండిస్ ఉన్నాడు. 21 మ్యాచ్‌లలో 35 వికెట్లు పడగొట్టిన మెండిస్ 6.70 ఎకానమీతో ప్రేక్షకులకు నిజమైన క్రికెట్‌ వినోదాన్ని పరిచయం చేశాడు. 2009 నుంచి 2014 వరకూ మెండిస్ ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. మెండిస్ తర్వాత ఆరో స్థానంలో ఉన్నది పాకిస్తాన్ బౌలర్ ఉమర్ గుల్‌.  2007 నుంచి 2014 వరకూ టీ20 ప్రపంచకప్‌లో ఆడిన గుల్‌..24 మ్యాచ్‌లలో 35 వికెట్లు తీశాడు.


టాప్ టెన్ లో అశ్విన్‌ కూడా.. 


పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ టేకర్లలో ఏడో స్థానంలో ఉన్నది మన రవిచంద్రన్ అశ్విన్‌(R Ashwin). రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన అశ్విన్‌ 24 మ్యాచ్‌లో 32 వికెట్లు తీశాడు. టాప్ టెన్‌లో ఉన్న ఏకైక భారత బౌలర్‌ అశ్విన్ మాత్రమే. 2012 నుంచి 2022 వరకూ అశ్విన్ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. మార్చ్ నెలలో అతను తన 100 టెస్టలు పూర్తి చేసుకున్నారు. వందవ టెస్ట్ లో 10 వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు. ఐపిఎల్ లో రాజస్థాన్ తరపున ఆడుతూ కీలక వికెట్లు తీశాడు. 


అశ్విన్ తర్వాత పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసింది శ్రీలంక బౌలర్ హసరంగ. లెగ్ బ్రేక్ బౌలర్ అయిన హసరంగ 16 మ్యాచ్‌లలో 31 వికెట్లు తీశాడు.    తరువాత దక్షిణాఫ్రికాకు చెందిన పాస్ట్ బౌలర్‌ డేల్ స్టేన్,  పదో స్థానంలో ఇంగ్లీష్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నాడు.