Rohit Sharma slams half century off 19 balls against Australia:  వన్డే వరల్డ్‌ కప్‌ను తమ నుంచి లాక్కోన్నారన్న కోపమో........ చివరి మెట్టుపై తమను ఓడించారన్న కసో.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కలను భగ్నం చేశారన్న ఆగ్రహమో కానీ.. ఆస్ట్రేలియా( Australia)పై రోహిత్‌ శర్మ(Rohit Sharma) విరుచుకుపడ్డాడు. సెయింట్‌ లూసియాలో ఓవైపు వర్షం... మరోవైపు రోహిత్‌ సిక్సర్ల వర్షంతో తడిసిపోయింది. అలాంటి ఇలాంటి సిక్సులు కావివి. కవర్‌ డ్రైవ్‌లో కొట్టిన సిక్సులైతే అమ్మో... చూసేందుకు వెయ్యి కళ్లు కూడా సరిపోవు. అలాంటి ఇలాంటి సిక్సులు కావివి.. సాధికారికంగా కొట్టిన భారీ సిక్సర్లవి. రోహిత్ కొట్టిన ఓ సిక్సర్‌ వంద మీటర్ల దూరంలో పడిందంటే కంగారు బౌలర్లను రోహిత్‌ ఎంత కంగారు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రోహిత్‌.. తనను సిక్సర్ల కింగ్‌ అని ఎందుకు అంటారో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి డప్పు కొట్టి మరీ చాటి చెప్పాడు.

 

అదిరిందయ్యా రో"హిట్‌"

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ... మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ తీసుకున్నాడు. సెయింట్‌ లూసియా పిచ్‌ బ్యాటర్లకు అనుకూలమని...  ఇక్కడ 200 పరుగులు చేయడం చాలా తేలికని మాజీలు అప్పటికే పిచ్‌ను అంచనా వేయడంతో టీమిండియా భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. అదే ఊపుతో రోహిత్‌-కోహ్లీ మైదానంలోకి దిగారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్‌ విభాగం ఉన్న కంగారు బౌలర్లు ఈ మ్యాచ్‌లో రాణిస్తారని అంతా అనుకున్నారు. అదే నిజమైంది కూడా. ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిని ప్రారంభించిన హేజిల్‌ వుట్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి టీమిండియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే షార్ట్‌ పిచ్ బంతితో విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేశాడు. వెనక్కి పరిగెత్తుతూ డేవిడ్‌ మంచి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో తొలి ఓవర్‌ అయిదు బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. విరాట్‌ కోహ్లీ మరోసారి అసలు పరుగులేమీ చేయకుండానే అవుట్‌ కావడంతో టీమిండియా రక్షణాత్మక ధోరణిలో ఆడుతుందని అంతా అనుకున్నారు. పంత్‌ తొలి ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చి చివరి బంతిని డిఫెన్స్‌ ఆడడంతో టీమిండియా తొలి ఓవర్‌లో ఒకే పరుగు చేసి ఒక వికెట్‌ కోల్పోయింది. ఇక టీమిండియాపై ఆస్ట్రేలియా ఒత్తిడి పెంచుతుందని... బౌలర్లు చెలరేగుతారని అనుకున్నారు. కానీ రోహిత్‌ అది సాగనివ్వలేదు.

 

ఏందీ సామీ ఆ కొట్టుడు

రెండో ఓవర్‌లో రోహిత్‌ చెలరేగిపోయాడు. మిచెల్‌ స్టార్క్‌కు చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో రోహిత్‌ నాలుగు సిక్సర్లు ఓ ఫోర్‌ బాదాడు. ఆ నాలుగు సిక్సర్లు నాలుగు అద్భుతాలు అనడంలో అసలు సందేహమే అక్కర్లేదు. కవర్‌ డ్రైవ్‌లో కొట్టిన రెండు సిక్సర్లతో చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. అంతేనా ఈ ప్రపంచకప్‌లో రెండు హ్యాట్రిక్‌లు తీసి మంచి ఫామ్‌లో ఉన్న కమిన్స్‌ను కూడా రోహిత్‌ విడిచిపెట్టలేదు. కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 15 పరుగులు పిండుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో రోహిత్‌ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. పవర్‌ ప్లేలో టీమిండియా 57 పరుగులు చేస్తే అందులో రోహిత్‌ పరుగులే 50 పరుగులు కావడం గమానార్హం.