T20 World cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో ఫస్ట్‌రౌండ్‌ పోటీలు ముగిశాయి. ఆద్యంతం సంచలనాల మధ్య సాగిన ఈ మ్యాచుల్లో కొన్ని జట్లు అనూహ్య ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఛాంపియన్లుగా భావించిన వారికి షాకులు తగిలాయి. గ్రూప్‌-ఏ నుంచి 2, గ్రూప్‌-బి నుంచి 2 జట్లు సూపర్‌ 12కు చేరుకున్నాయి. ఆసియాకప్‌ విజేత శ్రీలంక, నెదర్లాండ్స్‌, జింబాబ్వే, ఐర్లాండ్‌ ప్రధాన పోటీలకు అర్హత సాధించాయి. శనివారం నుంచే సూపర్‌ 12 మ్యాచులు మొదలవుతున్నాయి.




నెదర్లాండ్స్‌ ఆహా!


ఫస్ట్‌రౌండ్ గ్రూప్‌-ఏలో అన్నీ షాకులే! ఊపుమీదున్న శ్రీలంకను తొలి మ్యాచులోనే నమీబియా 55 పరుగుల తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. సూపర్‌ 12కు అర్హత సాధించేలా కనిపించింది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిపోయి ఆశ్చర్యపరిచింది. తొలి పోరులో  ఓటమి పాలైనా లంకేయులు ధైర్యంగా ఆడారు. వరుసగా యూఏఈ, నెదర్లాండ్స్‌ను ఓడించి సూపర్‌ 12కు వచ్చేశారు. ఇక నెదర్లాండ్స్‌ అయితే యూఏఈ, నమీబియాపై ఆఖరి ఓవర్లలో గెలిచింది. అభిమానులకు థ్రిల్‌ను పంచింది. 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. సూపర్‌ 12లో శ్రీలంక గ్రూప్‌1లో చేరగా నెదర్లాండ్స్‌ గ్రూప్‌ 2లో చేరింది.


విండీస్‌కు గర్వభంగం


రెండుసార్లు ఛాంపియన్‌ వెస్టిండీస్‌కు గర్వభంగం తప్పలేదు. హిట్టర్లు, మంచి బౌలర్లు ఉన్నప్పటికీ జట్టు కూర్పు బాగాలేక ఇబ్బంది పడింది. చిన్న జట్లపైనా గెలవలేక ఇంటికెళ్లిపోయింది. మరోవైపు జింబాబ్వే, ఐర్లాండ్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఐర్లాండ్‌పై తొలి మ్యాచులో గెలిచిన ఆ జట్టు విండీస్‌పై ఓడి కలవరపడింది. ఆఖరి మ్యాచులో స్కాట్లాండును ఓడించి సూపర్‌ 12కు వెళ్లింది. ఇక ఐర్లాండ్‌ వరుసగా స్కాట్లాండ్‌, విండీస్‌ను ఓడించి రెండో స్థానంలో నిలిచింది. ప్రధాన పోటీల్లో గ్రూప్‌ 1లో ఆసీస్‌, న్యూజిలాండ్‌ వంటి జట్లతో ఆడనుంది. మరోవైపు జింబాబ్వే గ్రూప్ 2కు వెళ్లింది.


గ్రూప్‌ 1 కఠినం!


సూపర్‌ 12లో గ్రూప్‌ 1 టఫ్‌గా కనిపిస్తోంది. ఇందులో విజయాలు సాధించడం అంత సులభమేమీ కాదు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, ప్రమాదకరమైన ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ ఇందులోనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో పెద్ద జట్లనే గడగడలాడించే అఫ్గాన్‌, ఆసియాకప్‌ విజేత శ్రీలంక ఇందులోనే ఉన్నాయి. తాజాగా ఐర్లాండ్‌ వచ్చింది. దాదాపుగా అన్నీ పోరాటపటిమ కనబరిచే దేశాలే ఉండటం గమనార్హం. ఇక గ్రూప్‌ 2లో భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా పటిష్ఠంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ఎప్పుడేం చేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం నాయకత్వ సమస్యలు ఎదుర్కొంటోంది. నెదర్లాండ్స్‌, జింబాబ్వే పట్టుదలగా ఆడతాయి.