T20 World Cup 2022, IND vs NED: నెదర్లాండ్స్‌తో మ్యాచులో టీమ్‌ఇండియా దుమ్మురేపింది! ప్రత్యర్థికి 180 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. సిడ్నీ పిచ్‌ మందకొడిగా ఉన్నా, అప్పటికే 40 ఓవర్లు ఆడిన వికెట్టే అయినా భారత్‌ రెచ్చిపోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53; 39 బంతుల్లో 4x4, 3x6) మొదట దంచికొట్టాడు. ఆ తర్వాత కింగ్‌ విరాట్‌ కోహ్లీ (62*; 44 బంతుల్లో 3x4, 2x6) టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ (51*; 25 బంతుల్లో 7x4, 1x6) దీపావళి టపాసులా పేలాడు.




ముగ్గురు మొనగాళ్లు!


పిచ్‌ మందకొడిగా కావడం, వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. నెదర్లాండ్స్‌కు మంచి టార్గెట్‌ ఇవ్వాలని భావించింది. అందుకు తగ్గట్టే ఆటగాళ్లు దూకుడగా ఆడారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (9) త్వరగానే ఔటయ్యాడు. మీకెరన్‌ వేసిన 2.4వ బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అతడు రివ్యూ తీసుకుందామన్నా రోహిత్‌ శర్మ నిరాకరించాడు. వికెట్‌ పడ్డప్పటికీ హిట్‌మ్యాన్ నెదర్లాండ్స్‌ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. విరాట్‌తో కలిసి రెండో వికెట్‌కు 56 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం అందించాడు.




బాబోయ్‌ సూర్య!


టీమ్‌ఇండియా స్కోరు 84 వద్ద రోహిత్‌ను క్లాసెన్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత కింగ్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ జోరందుకున్నారు. పోటీపడి మరీ బంతిని బాదేశారు. విరాట్‌ 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకుంటే సూర్య 25 బంతుల్లోనే సాధించేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 48 బంతుల్లో 95 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించడంతో టీమ్‌ఇండియా స్కోరు 179/2కి చేరుకుంది. మిస్టర్‌ 360 షాట్లకు ఫ్యాన్స్‌ కుషీ అయ్యారు. నెదర్లాండ్స్‌లో మీకెరెన్‌, క్లాసెన్‌ చెరో వికెట్‌ తీశారు.