IND vs AUS Prediction and Preview: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup 2024) సూపర్‌ ఎయిట్‌ మ్యాచ్‌ (Super 8)లో తాడో పేడో తేల్చుకునే మ్యాచ్‌కు టీమిండియా(India) సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు రోహిత్‌ సేన కసితో ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌ కంగారులకు డూ ఆర్‌ డై కావడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. తమతో అంత ఈజీగా ఉండదని ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు(Australia) హెచ్చరికలు చేస్తున్న వేళ.. అసలు ఓటమే లేకుండా ముందుకు దూసుకుపోతున్న టీమిండియా ఎలా ప్రతిస్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. టీమిండియా గెలిస్తే ఆస్ట్రేలియాపైనే గెలవాలి.. అఫ్గాన్‌పైన కాదన్న కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ టీ 20 ప్రపంచకప్‌లోనే అత్యంత కీలకమైన మ్యాచ్‌ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

ఇరుజట్లు బలంగానే..

ఆస్ట్రేలియా-ఇండియా మధ్య మ్యాచ్‌ అంటే ఎప్పుడూ ఉత్కంఠ పతాకస్థాయిలో ఉంటుంది. అదే ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. T20 ప్రపంచ కప్ 2024లో సూపర్ ఎయిట్‌లో గ్రూప్ 1లో సెమీస్‌ బెర్తులపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఇరు జట్లు కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌ చేరే అవకాశం ఉండడంతో ఇది క్వార్టర్‌ ఫైనల్‌గా మారిపోయింది. అఫ్గాన్‌ (Afghan)చేతిలో చావు దెబ్బ తిన్న కంగారులు...టీమిండియాకు షాక్‌ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే భారత టాపార్డర్‌ చాలా బలంగా ఉంది. అందరకూ కలిసికట్టుగా రాణిస్తూ సత్తా చాటుతన్నారు. భారత్‌ ఇప్పటికే మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఉన్నా ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సెమీఫైనల్‌ బెర్తు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాంటి గణాంకాలతో పని లేకుండా సెమీస్‌ చేరాలని చూస్తోంది. సెయింట్ లూసియాలో జరిగే ఈ మ్యాచ్‌లో వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా బ్యాటింగ్‌ చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్‌-కోహ్లీ, పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లతో భారత్‌కు చాలా డీప్‌గా బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉంది. బౌలింగ్‌లోనూ బుమ్రా సారధ్యంలోని బౌలింగ్‌ దళం ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ బౌలింగ్‌ దాడిని ఆస్ట్రేలియా ఎదుర్కోవడం అంతే తెలికేం కాదు. ఈ ప్రపంచకప్‌లో అర్ష్‌దీప్ సింగ్ ప్రతి 10 బంతుల్లో ఒక వికెట్‌ తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

 

ఆసిస్‌ కష్టాలు

ఆస్ట్రేలియాకు ఈ ప్రపంచకప్‌లో ఏదీ కలిసి రావడం లేదు.  మిచెల్ మార్ష్‌ గత ఆరు ఇన్నింగ్స్‌లలో 17.60 సగటుతో కేవలం 88 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై ఆసిస్‌ అదనపు స్పిన్నర్‌తో ఆడింది. జట్టులోకి అష్టన్ అగర్‌ని తీసుకుని మిచెల్ స్టార్క్‌ను తప్పించింది. ఇప్పుడు జట్టులో కంగారులు ఏం మార్పులు చేస్తారో చూడాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పవర్‌ప్లేలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ను ఎదుర్కోవడంతో ఇబ్బంది పడుతుండడంతో అగర్‌ని కొనసాగించే అవకాశం ఉంది. 

 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్,  శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా

 

ఆస్ట్రేలియా  జట్టు : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్/ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.