Suryakumar Yadav Sports Hernia Surgery: భారత T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొన్ని రోజుల కిందట స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. త్వరలోనే ఆసియా కప్ 2025 జరగనున్న తరుణంలో టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. సర్జరీ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదటిసారి ప్రాక్టీస్ కోసం వచ్చాడు. గత వారం సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడని తెలిసింది. దాంతో ఆసియా కప్ టోర్నీకి సూర్య అందుబాటులో ఉంటాడని తేలడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూలై నెలలో జర్మనీలో ఈ సూర్యకుమార్‌కు స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ జరిగిందని తెలిసిందే.

ఆసియా కప్‌కు ముందు తిరిగొచ్చిన SKY

సూర్యకుమార్ యాదవ్ కడుపు దిగువ కుడి భాగంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. సర్జరీ తరువాత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సూర్య ఉన్నాడు. సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ (Asia Cup 2025)కి ముందు అతను జట్టుతో చేరనున్నాడని కన్ఫామ్ అయింది. ఈసారి ఆసియా కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించాలని ఏసీసీ ఇటీవల ప్రకటించింది.

ESPNcricinfo ప్రకారం, మొదట ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగే T20 సిరీస్‌తో సూర్యకుమార్ యాదవ్ కమ్ బ్యాక్ చేయాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ వచ్చే ఏడాది వరకు వాయిదా పడింది. దాంతో టీ20 కెప్టెన్ సూర్య నేరుగా ఆసియా కప్‌లో ఆడనున్నాడు. సూర్యను దిలీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టులో కూడా చేర్చారు. కానీ స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కారణంగా సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నమెంట్‌ను వదులుకోవలసి వచ్చింది.

ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్

ఆసియా కప్‌లో పాకిస్తాన్ తో ఆడవద్దని టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన రిటైర్డ్ క్రికెటర్ల లెజెండ్స్ టోర్నీలో సెమీఫైనల్లో పాకిస్తాన్ తో తాము ఆడే ప్రసక్తి లేదని భారత ఆటగాళ్లు స్పష్టం చేశారు. వారి నిర్ణయాన్ని స్పాన్సర్లు సైతం స్వాగతించారు. దాని ఫలితంగా పాకిస్తాన్ జట్టు నేరుగా ఫైనల్ చేరింది. అదే సమయంలో ఆసియా కప్ షెడ్యూల్ ప్రకటన రావడంతో పాకిస్తాన్ తో మ్యాచులు ఆడటం అవసరమా.. ఆ దేశాన్ని మరింత దెబ్బకొట్టాలన్న డిమాండ్ వచ్చింది. భారత ప్రజల ప్రాణాలు తీసిన నేరస్తులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అని, అలాంటి దేశంతో మ్యాచులు ఆడటం వృథా అని కొందరు.. జాతీయ భద్రతకే ముప్పు కలిగించిన దేశంతో ఏ టోర్నీల్లోనూ పాల్గొనవద్దన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి.

భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ ఆసియా కప్‌ ద్వారా జట్టులోకి తిరిగి రానున్నాడు. ఇదే ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌పై వివాదం చెలరేగింది. కొంతమంది ఈ మ్యాచ్‌ను వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్‌తో ఆడి వారిని వీలుచిక్కినప్పుడల్లా చిత్తుగా ఓడించాలని మరికొందరు కోరుకుంటున్నారు. భారత్, పాకిస్తాన్‌తో ఆడకపోతే, ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో టీమిండియాకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.