The Oval Test Updates: ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో ఆరు పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసుకున్న టీమిండియా పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. 93 ఏళ్ల భారత టెస్టు చరిత్రలో ఇదే అత్యంత తక్కువ మార్జిన్ తో వచ్చిన గెలుపు కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు 2004లో ముంబైలో జరిగిన టెస్టులో కేవలం 14 పరుగులతో విజయం సాధించింది. దీంతో తాజాగా ఆ రికార్డుకు చెక్ పెట్టి, సింగిల్ డిజిట్ స్కోరు తేడాతో టెస్టును నెగ్గిన అరుదైన జాబితాలోకి చేరిపోయింది. అలాగే ఈ సిరీస్ లో టీమిండియా ఓవరాల్ గా 3,809 పరుగులు చేసింది. ఐదు టెస్టుల సిరీస్ లో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. యువ ప్లేయర్ల బ్యాటింగ్ ప్రతిభతో ఈ ఘనత సాధ్యమైంది.
దిగ్గజాలను దాటేసిన గిల్..ఈ సిరీస్ కు ముందు విమర్శలు ఎదుర్కొన్న భారత కెప్టెన్ శుభమాన్ గిల్.. తన సత్తా చాటాడు. బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించి, 754 పరుగులు చేశాడు. అతని సగటు 75.4 కావడం విశేషం. ఇందులో మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉండటం విశేషం. అలాగే ఒక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా సునీల్ గావస్కర్ (732) రికార్డును గిల్ దాటేశాడు. అలాగే ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన గ్రహం గూచ్ రికార్డు (752)ను కూడా స్వల్ప తేడాతో సవరించాడు.
ఇంగ్లాండ్ కు నిరాశ..ఇక తమతో జరిగిన టెస్టు సిరీస్ లో టెస్టు సిరీస్ విజయాన్ని దక్కకుండా చేయడంలో ఇండియా.. ఇంగ్లాండ్ ను నిలువరించింది. 2018 నుంచి ఇండియాపై ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఇలా జరగడం వరుసగా నాలుగో సిరీస్ కావడం విశేషం. 1996-2011 తర్వాత ఇదే రెండో అత్యధిక స్ట్రీక్ కావడం విశేషం. అప్పుడు ఐదు సిరీస్ ల్లో ఇండియాపై ఇంగ్లాండ్ సిరీస్ గెలుపు నమోదు చేయలేదు. ద ఓవల్ లో చేసిన సెంచరీ తర్వాత ఒక జట్టుపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (13) చేసిన సునీల్ గావస్కర్ ను రూట్ సమం చేశాడు. గతంలో వెస్టిండీస్ పై గావస్కర్ 13 సెంచరీలు చేయగా.. తాజాగా రూట్ కూడా ఇండియాపై అన్నే సెంచరీలు చేశాడు. అందరికంటే మిన్నగా డాన్ బ్రాడ్ మన్.. ఇంగ్లాండ్ పై 19 సెంచరీలు చేసి టాప్ లో నిలిచాడు. అలాగే ఇండియాపై అంతర్జాతీయ క్రికెట్లో 16 సెంచరీలు చేసి, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అలాగే ఇదే మ్యాచ్ లో డబ్ల్యూటీసీలో ఆరు వేల పరుగుల మార్కును చేరుకున్న తొలి ప్లేయర్ గా రూట్ నిలిచాడు.