ముంబై: ఆసియా కప్ 2025 విజయం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ఘన స్వాగతం లభించింది. సూర్యకుమార్ మాట్లాడుతూ.. "ఆసియా కప్ విజేతగా నిలిచి స్వదేశానికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. మేం గత కొన్ని రోజుల మంచి క్రికెట్ ఆడి టోర్నమెంట్ గెలిచాము. ఇది మాకు గొప్ప అనుభవం. ప్రభుత్వం, BCCI మాకు స్వేచ్ఛగా ఆడటానికి అవకాశం ఇచ్చాయి. దాంతో పూర్తి స్థాయి ప్రదర్శన చేసి ఆసియా కప్ లో  విజయం సాధించాము. మా కోసం దేశ ప్రజలు ప్రార్థనలు చేయడం ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తుంది’ అన్నాడు.

దుబాయ్: పాకిస్తాన్ మంత్రి, ఏసీసీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా #AsiaCup2025 ట్రోఫీని భారత్ తిరస్కరించడంపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించారు. దీనిపై భారత్‌తో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ, పాకిస్తాన్ జట్టును తమ జట్టు ఓడించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్ తో పోల్చడంపై సైతం సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అసలు అది వివాదమే కాదు.. అసలైన ట్రోఫీకి అర్థం ఇదేపాకిస్తాన్ మంత్రి నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకపోవడాన్ని నేను వివాదం అని పిలవను. ప్రజలు ట్రోఫీ ఫోటోలను మా చేతుల్లో ఉన్నట్లు, మేం ట్రోఫీతో సెలబ్రేట్ చేసుకున్నట్లు పోస్ట్ చేశారు. కానీ నిజమైన ట్రోఫీ అంటే మేం ప్రజల హృదయాలు గెలుచుకోవడం. ఆటగాళ్లు దేశ ప్రజల నుంచి సంపాదించే నమ్మకం. మాతో పాటు సహాయక సిబ్బంది, వారు చూపిన నమ్మకం, తెరవెనుక మాకోసం పనిచేసే వారిపై విశ్వాసం ఉంచడం నిజమైన ట్రోఫీ. నిజమైన ట్రోఫీ అంటే మైదానంలో బరిలోకి దిగి విజయం సాధించడమే’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

మోదీ ముందుండి బ్యాటింగ్ చేస్తే..

"ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్" అనే భారత ప్రధాని మోదీ ట్వీట్ పై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. "దేశ ప్రధాని స్వయంగా ముందుండి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంటుంది. ఆయన జట్టు కోసం స్ట్రైక్ తీసుకుని పరుగులు చేసినట్లు అనిపించింది. ఇది చాలా మంచి విషయం. మోదీ సర్ మమ్మల్ని ముందుండి నడిపిస్తే ఖచ్చితంగా ఆటగాళ్ళు స్వేచ్ఛగా ఆడతారు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దేశం మొత్తం విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. మేం (భారతదేశానికి) తిరిగి వెళ్ళినప్పుడు, ఆ విషయం బాగా అనిపిస్తుంది. దేశం కోసం మరిన్ని విజయాలు సాధించడానికి మాకు మరింత ప్రేరణ ప్రేరణ లభిస్తుంది’ అన్నాడు.