Suryakumar Yadav Maintains Pole Position In Batting List: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌(T20I Rankings)లో నంబర్‌వన్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. మూడు నెలలు ఆటకు దూరంగా ఉన్నా సూర్యా నెంబర్ వన్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతుండడం విశేషం. ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ ఆరో స్థానంలో ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అదిల్ రషీద్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ నాలుగో స్థానంలో, రవి బిష్ణోయ్‌ అయిదో స్థానంలో నిలిచారు. అఫ్గాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంకు సాధించాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో షకిబ్‌ అల్‌ హసన్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. హార్దిక్‌ పాండ్య ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. 

 

ఐపీఎల్‌కు దూరం!

ఐపీఎల్‌(IPL) ప్రారంభానికి ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్‌ తగిలేటట్టే ఉంది. టీమిండియా స్టార్, విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయానికి సూర్య జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్య గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే సూర్య ఇంకా పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. తాజాగా సూర్య చేసిన పోస్ట్‌ కూడా దీనికి బలం చేకూరుస్తోంది. హృదయం బద్దలైనట్లు ఉన్న ఎమోజీని సూర్య ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఇది చూసి సూర్య ఐపీఎల్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడనే నెటిజన్లు అనుకుంటున్నారు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్‌ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి  వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యాడు గాయం కారణంగా జనవరి 11న స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సూర్య భాయ్‌ అందుబాటులో లేదు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో సూర్య కోలుకుంటాడని అప్పట్లో  బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

 

ఐసీసీ టీ 20 జట్టు కెప్టెన్‌గానూ...

టీమిండియా(Team India) టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav)కు అరుదైన గౌరవం దక్కింది. టీ 20 క్రికెట్‌లో మెరుపులు మెరిపించే ఈ విధ్వంసకర ఆటగాడిని 2023 ఐసీసీ టీ 20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నియమించింది. ప్రతి ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(International Cricket Council).. క్రికెట్లోని ప్రతి ఫార్మాట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో టీంలను ప్రకటిస్తుంది. 2023 సంవత్సరానికిగానూ అంతర్జాతీయ టీ20 జట్టుకు కెప్టెన్‌గా భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య భాయ్‌ నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు. ఐసీసీ ప్రకటించిన 2023 టీ20 జట్టులో టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ , స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. గత ఏడాది టీ 20ల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సహా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు.