వచ్చే ఏడాది అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్‌ను గెలుస్తామని టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న అయిదు టీ 20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సూర్య... పొట్టి ప్రపంచకప్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే టోర్నమెంట్‌లలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తామని... దానికి తగ్గ ప్రణాళికలు కూడా రచిస్తున్నామని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. అయితే వచ్చే ఏడాది ఐసీసీ నిర్వహించే టీ 20 ప్రపంచకప్‌ను తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం తమకుందని సూర్య స్పష్టం చేశాడు.
వన్డే ప్రపంచకప్ ముగిసి అయిదారు రోజులే గడిచాయని అందరూ నిరాశలో ఉన్నారని స్కై అన్నాడు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన అభిమానుల మద్దతు చూస్తుంటే గొప్పగా ఉందని... ఆటలు ఎన్నో పాఠాలు నేర్పుతాయని.. అలాగే భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్ కూడా తమకు పాఠాలు నేర్పిందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. అభిమానుల మద్దతు ఇలాగే కొనసాగాలని కోరాడు. ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం జట్టు డ్రెస్సింగ్ గదికి ప్రధాని మోదీ వచ్చి తమలో స్ఫూర్తి నింపారని సూర్య వెల్లడించాడు. ఫైనల్ ముగిశాక డ్రెస్సింగ్ గదిలో కూర్చున్నామని.. అప్పుడే ప్రధాని వచ్చి తమలో స్ఫూర్తి నింపారని సూర్య తెలిపాడు. ఓటమిని మర్చిపోయి ముందుకు సాగాలని ప్రధాని సూచించారని.. ప్రధాని తమతో సమయం గడపడం చాలా పెద్ద విషయమని సూర్యా అన్నాడు. ప్రధాని మోదీ మాటలను చాలా జాగ్రత్తగా విన్నామని... ఆయన సూచనలను పాటిస్తామని సూర్య అన్నాడు.
ఇక ప్రపంచకప్ ముగిసిన తర్వాతఓటమిని జీర్ణించుకోలేక టీమ్‌ఇండియా ఆటగాళ్లు మైదానంలో భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి క్షణాల్లో నిరాశలో కూరుకుపోయిన మన జట్టుకు భరోసానిచ్చి, ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినా ఫైనల్లో ఓడిపోవడంతో తమ గుండె బద్దలైందని రవీంద్ర జడేజా ట్వీట్ చేశాడు. మీ మద్దతుతోనే మేం ముందుకు సాగుతున్నామని ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్‌కు రావడం చాలా ప్రత్యేకంగా అన్పించిందన్న రవీంద్ర జడేజా... ఇదీ ఎంతో ప్రేరణనిచ్చిందని జడ్డూ పోస్ట్‌లో పేర్కొన్నాడు. షమీ కూడా మరో ఫొటోను షేర్ చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపాడు. మళ్లీ బలంగా తిరిగొస్తామని తాను చేసిన ట్వీట్‌లో ఈ స్పీడ్ స్టార్ పేర్కొన్నాడు.
టోర్నీ ఆసాంతం భారత ఆటగాళ్లు కనబరిచిన ప్రతిభ,అంకితభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే కొనియాడారు. గొప్ప స్ఫూర్తితో ఆడిన మిమ్మల్ని చూసి దేశం యావత్తూ గర్విస్తోందని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికీ, ఎప్పటికీ మేము మీకు అండగా ఉంటామని మోదీ పేర్కొన్నారు. పంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్‌సేనపై దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు ప్రదర్శన పట్ల దేశం గర్విస్తోందని కపిల్ తెలిపాడు. ఛాంపియన్స్‌లా ఆడారని... సగర్వంగా తల ఎత్తుకోండని సూచించారు.