వరుస గాయాలతో సతమతమవుతున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ షమీ దూరమవ్వగా.. ఇప్పుడు భారత జట్టు టీ 20 సారధి సూర్యకుమార్ యాదవ్ కూడా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా సూర్య కాలు మెలిక పడింది. చీలమండలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి కనీసం 7 వారాలు పట్టనున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో సూర్యకుమార్ యాదవ్ దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. గాయం కారణంగా జనవరి 11న స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సూర్య భాయ్ అందుబాటులో ఉండడు. జాతీయ క్రికెట్ అకాడమీలో సూర్య కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. హార్దిక్ పాండ్య కూడా గాయంతో నుంచి ఇంకా కోలుకోకపోవడం... సూర్య కూడా గాయపడడంతో అఫ్గానిస్థాన్ సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించాల్సి ఉంది.
అయితే తన గాయంపై సూర్యకుమార్ యాదవ్ తొలిసారి స్పందించాడు. గాయాలు ఎప్పుడూ సరదగా ఉండవని సూర్య భాయ్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తానని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి మైదానంలో అడుగుపెడతానని సూర్య అభిమానులకు హామీ ఇచ్చాడు. ఈ విరామ సమయంలో మీరందరూ ప్రతిరోజూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని సూర్య పోస్ట్ చేశాడు.
ఈ ఏడాది సూర్య ఎన్ని పరుగులు చేశాడంటే..?
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో సూర్య ఒక సెంచరీ, ఒక ర్ధ సెంచరీతో 156 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు. ఈ ఏడాది 18 టీ 20 మ్యాచుల్లో సూర్యకుమార్ 48.86 సగటు.. 155.95 స్ట్రైక్ రేట్‌తో 733 పరుగులు చేశాడు. అత్యుత్తమ స్కోరు 112. ఈ ఏడాది సూర్యా రెండు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు చేశాడు. మొత్తం 60 T20 మ్యాచుల్లో సూర్యకుమార్ నాలుగు సెంచరీలు, 17 అర్ధసెంచరీలు చేశాడు. 45.55 సగటుతో.. 171 స్ట్రైక్ రేట్‌తో 2,141 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 117.
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. చేతి వేలికి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్ నుంచి వైదొలిగాడని స్పష్టం చేసింది. రుతురాజ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని... అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వెల్లడించింది. రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి భారత్‌కు వస్తాడని... జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో ఈశ్వరర్‌కు లక్కీగా ఛాన్స్ వచ్చింది. సర్ఫరాజ్‌కు మాత్రం మరోసారి మొండిచేయే ఎదురైంది.