Sunil Gavaskar supports Rohit Sharma: సుదీర్ఘ ఫార్మాట్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) చేసిన వ్యాఖ్యలకు క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌(Sunil Gavaskar)  మద్దతు తెలిపాడు. టెస్టు క్రికెట్‌ ఆడే ఆకలి లేని క్రికెటర్లను టీంలో కి తీసుకోవద్దంటూ రోహిత్‌ శర్మ ఇటీవల వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలను సునీల్ గవాస్కర్‌ సమర్ధించాడు. రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు పూర్తి నిజమని.. టెస్టు క్రికెట్‌ ఆడాలనుకునే వారినే ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీకి సూచించాడు. తాను ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెబుతున్నానని గుర్తు చేశాడు. భారత క్రికెట్‌ వల్లే ప్రతి ఆటగాడికి పేరు, డబ్బు, గుర్తింపు వచ్చాయని... భారత క్రికెట్‌పై క్రికెటర్లు విధేయత చూపాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఎవరైనా ఏ కారణం చేతనైనా పదే పదే దేశానికి ఆడను అని అంటే కచ్చితంగా యువ ఆటగాళ్లకు మరిన్ని ఎక్కువ అవకాశాలివ్వాలని గవాస్కర్‌ సూచించాడు. ఇలాంటి వైఖరిని సెలెక్టర్లు అలవర్చుకుంటే భారత క్రికెట్‌కు మేలు చేస్తుందని గవాస్కర్‌ అన్నాడు.




జురెల్‌పై ప్రశంసల జల్లు
టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌పై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. జురెల్‌ను చూస్తుంటే మరో ధోనీలా కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. ధ్రువ్‌ జురెల్‌ ఏకాగ్రతలో మరో ధోనీని తలపిస్తున్నాడని గవాస్కర్‌ అన్నాడు. శతకం చేజారినాఉం ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడని గవాస్కర్‌ అన్నాడు. నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన ధ్రువ్‌ జురెల్‌..తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్‌ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్‌ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని... బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్‌ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్‌.. తన మొదటి సిరీస్‌ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అని. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్‌ తెలిపాడు.


ఆధిపత్యం ప్రదర్శించాం
యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఆనందంగా ఉందన్నాడు. సీనియర్లు మళ్లీ జట్టులోకి వచ్చినా ఒత్తిడికి గురికాకుండా నిర్ణయం తీసుకొంటామని హిట్‌ మ్యాన్‌ స్పష్టం చేశాడు. కఠిన పరిస్థితులను ఎదుర్కొని అద్భుతంగా ఆడిన ధ్రువ్‌ జురెల్‌పై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టు సిరీస్‌లో అద్భుత పోరాటంతో యువ ఆటగాళ్లు సత్తా చాటారాన్న రోహిత్‌... మరో మ్యాచ్‌ మిగిలిఉండగానే టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. మైదానంలో మేం ఎలా ఆడాలని భావించామో.. అదే తీరులో ఆధిపత్యం ప్రదర్శించామని తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడి నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్లేయర్లూ సత్తా చాటారని హిట్‌మ్యాన్‌ కొనియాడాడు. యువ క్రికెటర్లకు స్వేచ్ఛ ఇచ్చి ఆడేలా చేయగలగడంలో తాను, కోచ్‌ ద్రావిడ్‌ విజయవంతం అయ్యామని రోహిత్‌ తెలిపాడు. రెండో టెస్టు ఆడుతున్న ధ్రువ్ జురెల్ ఏ ఒత్తిడికి గురికాకుండా గొప్ప పరిణితి ప్రదర్శించాడని హిట్‌ మ్యాన్‌ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీతో సహా సీనియర్లు వచ్చినప్పుడు జట్టులో మార్పుల గురించి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని రోహిత్‌ స్పష్టం చేశాడు. చివరి మ్యాచ్‌లోనూ ఉత్సాహంగా బరిలోకి దిగుతామని రోహిత్ వెల్లడించాడు.