Gavaskar on Pujara: 


సీనియర్‌ క్రికెటర్‌ చెతేశ్వర్‌ పుజారాకు సునీల్‌ గావస్కర్‌ అండగా నిలిచాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ మొత్తం విఫలమైందన్నాడు. అలాంటప్పుడు అతడిని మాత్రమే ఎందుకు బలిపశువును చేస్తున్నారని ప్రశ్నించాడు. రంజీల్లో రాణిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయాలను ఆయన తీవ్రంగా విమర్శించాడు.


వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీసులకు సెలక్షన్‌ కమిటీ టీమ్‌ఇండియాను ప్రకటించింది. రెండు టెస్టుల సిరీసుకు నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాను ఎంపిక చేయలేదు. యువ క్రికెటర్లు యశస్వీ జైశ్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ను తీసుకున్నారు. మరోవైపు దేశవాళీ క్రికెట్లో మూడు సీజన్లుగా పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌నూ వదిలేశారు. దాంతో కమిటీ నిర్ణయాల్లో లోపాలను దిగ్గజ క్రికెటర్‌ సన్నీ ఎత్తిచూపాడు.


'కేవలం పుజారాను మాత్రమే ఎందుకు తొలగించారు? మన బ్యాటింగ్‌ వైఫల్యాలకు అతడినెందుకు బలిపశువును చేస్తున్నారు? భారత్‌ క్రికెట్‌కు అతడెంతో విశ్వాసంతో సేవ చేస్తున్నాడు. సోషల్‌ మీడియాలో కోట్లమంది ఫాలోవర్లు లేనందుకే అతడిని తప్పించారా? తీసేసినా వాళ్లెవరూ ప్రశ్నించరని, పట్టించుకోరని భావించారా? మిగతావాళ్లు ఫెయిలైనా అతడిని మాత్రమే డ్రాప్‌ చేయడంతో నాకిలాగే అనిపిస్తోంది. అతడిని తీసేయడంలో లాజిక్‌ ఏంటో అడుగుదామంటే సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ కనీసం మీడియా సమావేశాలైనా పెట్టడం లేదు' అని సన్నీ గావస్కర్‌ అన్నాడు.


మరో రెండేళ్లు పుజారా టీమ్‌ఇండియాకు సేవలు అందించగలడని గావస్కర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం క్రికెటర్లు ఫిట్‌గా ఉంటున్నారని, 40 ఏళ్ల వరకు ఆడుతున్నారని సూచించాడు. రిషభ్ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగొస్తే జట్టు ఎంపిక మరింత కష్టమవుతుందని వెల్లడించాడు.


'పుజారా చాలాకాలంగా కౌంటీ క్రికెట్‌ ఆడుతున్నాడు. అంటే సుదీర్ఘ ఫార్మాట్‌ విపరీతంగా ఆడుతున్నట్టే. మ్యాచుల్లో ఎలా ఆడాలో అతడికి తెలుసు. ఈ రోజుల్లో ఆటగాళ్లు 39-40 ఏళ్ల వరకు ఆడగలరు. ఫిట్‌గా ఉంటే అందులో తప్పేం లేదు. పరుగులు చేస్తూ వికెట్లు పడగొట్టినంత వరకు ఫర్వాలేదు. ఎంపికకు వయసును పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఒక్కర్నే తప్పించారు. నా వరకైతే అజింక్య రహానె తప్ప బ్యాటర్లంతా ఫెయిలయ్యారు. కానీ పుజారా మాత్రమే ఎందుకు తప్పుగా కనిపించాడో సెలక్టర్లు చెప్పాలి' అని సన్నీ ప్రశ్నించాడు.


సర్ఫరాజ్‌ఖాన్‌ను ఎంపిక చేయనప్పుడు రంజీ ట్రోఫీలకు ఉన్న విలువేంటో వివరించాలని గావస్కర్‌ అన్నాడు. మూడు సీజన్లుగా అతడు టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడని గుర్తు చేశాడు. సర్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత ఫస్ట్‌క్లాస్‌లో 79.65 సగటు ఉన్నది అతడికి మాత్రమేనని సూచించాడు. ఐపీఎల్‌లో బాగా ఆడితే టెస్టుల్లో కూడా ఎంపికవ్వొచ్చేమోనని ఎద్దేవా చేశాడు.


'ఇప్పుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో బాగా ఆడితే చాలు టెస్టు క్రికెట్లోనూ ఎంపిక చేస్తారు. పరిస్థితి అలాగే ఉంది. ఒకసారి టెస్టు జట్టును చూడండి. రెండు టెస్టులకు నలుగురు ఓపెనర్లను తీసుకున్నారు. ఆరుగురు ఓపెనర్లు ఉండటానికి ఇదేమీ ఒకప్పటి వెస్టిండీస్‌ పేస్‌ అటాకింగ్‌ కాదు. మూడు సీజన్లుగా సర్ఫరాజ్‌ 100 సగటుతో స్కోర్లు చేస్తున్నాడు. టెస్టుల్లో ఎంపిక అవ్వడానికి అతడింకా ఏం చేయాలి? తుది 11 మందిలో లేకున్నా కనీసం జట్టులోకైనా తీసుకోవాల్సింది. కనీసం అతడి ప్రదర్శనలను గుర్తిస్తున్నామని చెప్పండి. లేదంటే రంజీలు ఆడటం మానేయమని చెప్పండి. వాటితో పన్లేదు. ఐపీఎల్‌లో బాగా ఆడితే టెస్టుల్లోకి తీసుకుంటామని చెప్పండి' అని గావస్కర్‌ ఘాటుగా మాట్లాడాడు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial