Yuvraj Singh on MSD: 


ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2011 తర్వాత ఎంఎస్‌ ధోనీ మారిపోయాడని యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. క్యాన్సర్‌తో పోరాడి పునరాగమనం చేశాక తనను ఎక్కువగా నమ్మలేదని పేర్కొన్నాడు. అప్పటికే ఆటలో చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ మద్దతు ఇవ్వడంతోనే మళ్లీ టీమ్‌ఇండియాలోకి వచ్చానని వెల్లడించాడు.


మహేంద్రసింగ్‌ ధోనీ నేతృత్వంలో టీమ్‌ఇండియా గెలిచిన ప్రతి ఐసీసీ టోర్నీలో యువరాజ్‌ సింగ్‌ (Yuvaraj Singh) కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపాడు. మిడిలార్డర్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇక స్వదేశంలో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. లీగ్‌ నుంచి నాకౌట్‌ వరకు అన్ని మ్యాచుల్లో అదరగొట్టాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణించాడు. కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి విలువైన ఇన్నింగ్సులు ఆడాడు. అలాగే ఎడమచేతి వాటం స్పిన్‌తో వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన  క్వార్టర్‌ ఫైనల్లో అతడి బ్యాటింగ్‌ న భూతో న భవిష్యతి!


వన్డే ప్రపంచకప్‌ తర్వాత యువీ ఇంగ్లాండ్‌లో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత టీమ్‌ఇండియాలో అడుగుపెట్టాడు. అంతకు ముందు తన ప్రధాన ఆయుధంగా వాడుకున్న ధోనీ (MS Dhoni) ఆ తర్వాత ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. సరైన విధంగా మద్దతు ప్రకటించలేదు. 2015 వన్డే ప్రపంచకప్‌కు తీసుకోలేదు. అయితే ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు 2017లో మళ్లీ పునరాగమనం చేశాడు. ఇందుకు కోహ్లీ అండగా నిలిచాడు.


'నేను పునరాగమనం చేసినప్పుడు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అండగా నిలిచాడు. అతడి సాయం వల్లే మళ్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడాను. అయితే 2019 వన్డే ప్రపంచకప్‌కు సెలక్టర్లు నన్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎంఎస్ ధోనీ స్వయంగా చెప్పాడు' అని యువరాజ్ సింగ్‌ అన్నాడు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial


'2011 వన్డే ప్రపంచకప్‌ వరకు ఎంఎస్‌ ధోనీ నన్నెంతో నమ్మాడు. నేను అతడి ప్రధాన ఆటగాడిని. క్యాన్సర్‌ నుంచి కోలుకొని పునరాగమనం చేశాక పరిస్థితులు మారిపోయాయి. ఆట చాలా వరకు మారిపోయింది. అందుకే 2015 ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించడంపై నేనెవరినీ నిందించాలని అనుకోవడం లేదు. ధోనీ మారాడన్నది నిజం. అయితే కెప్టెన్‌గా అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదని నేను అర్థం చేసుకోగలను. టీమ్‌ఇండియా ప్రదర్శనే అందరికీ అవసరం' అని యువీ తెలిపాడు.