ICC Champions Trophy 2025 Latest Upadates: భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అవతున్న సంగతి తెలిసింది. ప్రత్యర్థి ఎవరైనా, ఏ గేమ్ అయినా, ధాటిగా బ్యాటింగ్ చేసి జట్టుకు ఫ్లైయింగ్ స్టార్ట్ ఇస్తున్నాడు. అయితే దీని వల్ల చాలాకాలంగా తను 20- 40 పరుగుల మధ్యే ఔటవుతున్నాడు. తాజాగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కూడా దీన్ని సమర్థించాడు. రోహిత్ అందించే స్టార్ట్ తమకెంతో అవసరమని వ్యాఖ్యానించాడు. తన నుంచి ఇలాంటి ఇన్నింగ్సే కోరుకుంటున్నాట్లు పేర్కొన్నాడు. అయితే తాజాగా దీనిని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తప్పుబట్టాడు. రోహిత్ ఇలాంటి ఆటతీరు ప్రదర్శించడం సరికాదని, తను వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తే జట్టుకే మంచిదని వ్యాఖ్యానించాడు. ఏ బ్యాటర్ కైనా, 25- 30 పరుగులు చేస్తే ఆనందంగా ఉండదని, వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసి పరుగులు భారీగా సాధించాలని ఉంటుందని పేర్కొన్నాడు.
అలా చేస్తే మేలు..రోహిత్ చాలా ప్రతిభావంతుడైన ప్లేయరని, అతడు ఎక్కువ సేపు క్రీజులో ఉంటే మ్యాచ్ ను ప్రత్యర్థి నుంచి దూరం చేస్తాడని గావస్కర్ గుర్తు చేశాడు. 25 ఓవర్లపాటు బ్యాటింగ్ చేస్తే ఇండియా కచ్చితంగా 180-200 పరుగులు చేస్తుందని, అప్పటికి ఒకట్రెండు వికెట్లు కోల్పోయినా, తర్వాత బ్యాటర్ల సహకారంతో ఇండియా 350 పరుగుల మార్కును ఈజీగా చేరుకోగలదని పేర్కొన్నాడు. అలా చేస్తే టీమిండియాకి తిరుగుండదని వ్యాఖ్యానించాడు. రోహిత్ దగ్గర చాలా షాట్లు ఉన్నాయని, మిగతా బ్యాటర్ల కంటే బంతిని బాగా టైమ్ చేయగల సామర్థ్యం అతని సొంతమని ప్రశంసించాడు. అలాంటి బ్యాటర్ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించాడు.
అతనికి కూడా ఇష్టముండదు..చాలా తక్కువ పరుగులకే ఎక్కువ సార్లు ఔటవడం రోహిత్ కు కూడా నచ్చబోదని గావస్కర్ పేర్కొన్నాడు. ఏ బ్యాటర్ అయినా సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతాడని, అనవసర దూకుడు కన్నా వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తేనే వన్డేల్లో భారీ స్కోర్లు సాధించవచ్చని పేర్కొన్నాడు. మరోవైప వన్డేల్లో సుదీర్ఘమైన బ్యాటింగ్ చేయగల సత్తా రోహిత్ కు ఉంది. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగుల రికార్డు రోహిత్ పేరిటే ఉంది. అలాగే మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ గా రోహిత్ రికార్డులకెక్కాడు. దీంతో రోహిత్ సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి, సెంచరీలు సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న భారత్.. లీగ్ దశతోపాటు సెమీస్ లోనూ అజేయంగా నిలిచి, ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ ను తలపడనుంది. ఇక ఇప్పటివరకు జరిగిన రెండు ఐసీసీ ఫైనల్స్ లోనూ కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్స్ లోనూ ఇండియా ఓడిపోయింది. ఆదివారం జరిగే మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.