ICC Makes Stop Clock Rule Permanent In ODIs, T20Is: అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లోకి మరో కొత్త రూల్‌ను తీసుకొస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) ప్రకటించింది. జూన్‌లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌ నుంచి స్టాప్‌ క్లాక్‌ నిబంధనను అమల్లోకి తేనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. టీ20లతో పాటు వన్డేల్లోనూ ఈ నిబంధన ఉంటుంది. ఆట వేగాన్ని పెంచేందుకు వన్డే, టీ20 క్రికెట్లో ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఓవర్‌ పూర్తయిన 60 సెకన్లలలోపు తర్వాతి ఓవర్‌ను మొదలెట్టడంలో ఫీల్డింగ్‌ జట్టు మూడోసారి విఫలమైతే ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడానికి విధించిన 60 సెకన్ల పరిమితిని మూడోసారి దాటితే.. 5 పరుగుల పెనాల్టీ విధిస్తామని ప్రకటించింది. ఓవర్ల మధ్యలో తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.  ఓవర్ల మధ్య సమయం వృథా కాకుండా చూడాలన్నదే ఈ రూల్‌ ఉద్దేశమని వివరించింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి పిచ్‌ను నిషేధించే నిబంధనల్లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. 



మినహాయింపులు
స్టాప్‌ క్లాక్‌ నిబంధనను ఏప్రిల్‌ చివరి వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించాలని భావించినా ఈ నిబంధన వల్ల ఇప్పటికే సత్ఫలితాలు రావడంతో జూన్‌ నుంచి దీన్ని అధికారికం చేయబోతున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కొత్త బ్యాటర్‌ రావాల్సినపుడు, డ్రింక్స్‌ విరామం తీసుకున్నపుడు, ఏదైనా కారణంతో అంపైర్లు ఆటను ఆపినపుడు తప్ప దీనికి మినహాయింపు లేదు. నిమిషానికి మించి వ్యవధి తీసుకుంటే రెండుసార్లు హెచ్చరికతో సరిపెడతారు. మూడోసారి కూడా సమయం మించితే.. బౌలింగ్‌ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. స్టాప్‌ క్లాక్‌ నిబంధన వల్ల వన్డేల్లో దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతున్నట్లు ఐసీసీ వెల్లడించింది.


2027 ప్రపంచకప్‌లోనూ మార్పులు
ఇక 2027 ప్రపంచకప్‌లోనూ కొన్ని మార్పులు జరపనున్నుట్లు ఐసీసీ వెల్లడించింది. దక్షిణాఫ్రికా (South Africa), జింబాబ్వే (zimbabwe)లు తొలిసారిగా నమీబియా (namibia)తో కలిసి ఆతిథ్యమివ్వబోతున్న ఆ మెగా టోర్నీ ఎన్నో విశేషాలకు వేదిక కానుంది. ఈసారి పోటీపడే జట్లు, ఫార్మాట్‌, నిబంధనలు.. ఇలా కొత్త మార్పులతో అలరించనుంది. 2023 వరల్డ్ కప్‌లో మొత్తం పది జట్లు 48 మ్యాచ్ లు ఆడి కప్పు కోసం పోటీపడ్డాయి. కానీ 2027లో జట్ల సంఖ్య 14కు పెరుగుతుంది. దీంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 54కు చేరుతుంది. అయితే 2003 మాదిరే 2027లో ఫార్మాట్‌ ఉండనుంది. ఈసారి 10 జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో తలపడ్డాయి. దీంతో ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడింది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరాయి. కానీ వచ్చే ప్రపంచకప్‌ అలా కాదు మొత్తం 14 జట్లు 2 భాగాలుగా ఏడేసి చొప్పున విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఆ గ్రూప్‌ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్‌ చేరతాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.