Ind Vs Eng 2nd Test Updates: ఇండియాతో జరిగిన రెండో టెస్టులో 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో బర్మింగ్ హామ్ వేదికపై తన ఫస్ట్ ఎవర్ విక్టరీని టీమిండియా నమోదు చేసింది. అయితే మ్యాచ్ ముగిశాక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఓటమిపై తన అక్కసును వెల్లగక్కాడు. బర్మింగ్ హామ్ పిచ్ ఉపఖండపు పిచ్ ను పోలి ఉందని, అందుకే తాము ఓడిపోయామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఉపఖండపు పిచ్ లపై రెగ్యులర్ గా టీమిండియా ప్లేయర్లు ఆడతారని, తమకు అంతగా అలవాటు లేకపోవడంతో తేలిపోయామని పేర్కొన్నాడు. నిజానికి తొలి టెస్టులో అనూహ్య విజయంతో రెండో టెస్టులో విజయగర్వంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. అయితే చక్కని ప్రణాళికతో బరిలోకి దిగిన భారత్ అద్భుత విజయం సాధించింది. తాజాగా ఇలా పిచ్ పై నిందలు వేసి, తమ తప్పు లేదని స్టోక్స్ చెప్పడంపై భారత ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇండియాలో ఓడిపోయినా, ఇంగ్లాండ్ లో ఓడిపోయినా ఉపఖండపు పిచ్ ల వల్లే ఓడామని ఎలా చెబుతున్నారని విమర్శించారు.
ఓవర్ కాన్ఫిడెన్స్ తో..
నిజానికి బ్యాటింగ్ వైఫల్యంతోనే ఈ టెస్టులో ఇంగ్లాండ్ ఓడిపోయింది. కొంతమంది ఆటగాళ్లపై అతిగా ఆధారపడటం, పరిస్థితులకు సంబంధం లేకుండా బజ్ బాల్ తరహా ఆటతీరుతో చతికిల పడింది. తొలి టెస్టులో అరడజనుకు పైగా క్యాచ్ లు జారవిడవడంతోనే ఇంగ్లాండ్ గెలిచింది. క్యాచ్ లు సరిగ్గా పట్టినట్లయితే ఆ మ్యాచ్ లోనూ ఓడిపోయేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక వ్యూహం ప్రకారమే బ్యాటింగ్ పిచ్ లు తయారు చేసి, ఇప్పుడు బొక్క బోర్లా పడటంతో ఆ పిచ్ లను విమర్శించడం సరికాదని హితవు పలుకుతున్నారు.
బజ్ బాల్ పై అతినమ్మకం..
నిజానికి ఎడ్జ్ బాస్టన్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా చేసి, బౌండరీలైన్ ను కూడా 60 మీటర్లకు కుదించారు. భారత్ బలమైన బౌలింగ్ లైనప్ ను చూసి, ఇంగ్లాండ్ ఈ ఏర్పాట్టు చేసుకుంది. అయితే తమకు బలమైన బ్యాటింగ్ విఫలం కావడంతోనే ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. ముఖ్యంగా ఓపెనర్లపై అధికంగా ఆధారపడటం ఆ జట్టు కొంపముంచుతోంది. అలాగే స్టోక్స్ కూడా ఫామ్ లో లేక పోవడం మైనస్ పాయింట్ గా మారింది. అలాగే కీలక బౌలర్లు మార్క్ వుడ్, అట్కిన్సన్ గాయాలతో దూరం కావడం, జోఫ్రా ఆర్చర్ అందుబాటులో ఉన్నా తొలి టెస్టు విజయగర్వంతో తనను వాడుకోకపోవడం ఆ జట్టు ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. ఇక ఉపఖండపు పిచ్ లపై స్పిన్నర్లు పండుగ చేసుకుంటారు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి భారత స్పిన్నర్లకు రెండు వికెట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు ఇంగ్లాండ్ స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీయడం విశేషం. ఏదేమైనా ఆడలేక మద్దెల ఓడెను అన్నట్లు తమ బ్యాటింగ్ వైఫల్యంపై దృష్టి పెట్టకుండా, నిందను పిచ్ పైకి నెట్టడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఈనెల 10 నుంచి లార్డ్స్ మైదానంలో మూడో టెస్టు ప్రారంభమవుతుండటంతో ఆ వేదికలో ఎలాంటి పిచ్ ను రూపొందిస్తారోనని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.