భారత్‌ వేదికగా జరుగుతున్న అయిదు మ్యాచ్‌లో టీ 20 సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరుగురు ఆటగాళ్లు సిరీస్‌ మధ్యలోనే స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌, స్టార్‌ బౌలర్‌ ఆడమ్‌ జంపా ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు. ఈరోజు( మంగళవారం) జరిగేమూడో మ్యాచ్‌ ఆడిన తర్వాత గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, ఇంగ్లిస్‌, అబాట్‌ కూడా స్వదేశానికి వెళ్లిపోనున్నారు. పని భారం కారణంగా వారికి విశ్రాంతినిచ్చినట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. మూడో టీ20 సమయంలో వీరు నలుగురు ఇండియాలోనే ఉంటున్నా మ్యాచ్ మాత్రం ఆడడం లేదని కంగారు క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. స్వదేశానికి వెళ్లిన స్మిత్, జంపా స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్స్, బిగ్ హిట్టర్ అయిన్ బెన్ మెక్‌డెర్మాట్ జట్టులో చేరారు. రాయ్‌పూర్‌లో జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు బెన్ ద్వార్షుయిస్, స్పిన్నర్ క్రిస్ గ్రీన్ జట్టులో చేరుతారని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్తున్నప్పటికీ వారి స్థానంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నలుగురిని మాత్రమే జట్టులోకి తీసుకుంది. 



 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌పై వీరోచిత శతకం చేసిన ట్రావిస్ హెడ్‌ మాత్రం జట్టుతోపాటే కొనసాగనున్నాడు. ఆసీస్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని వన్డే కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సమర్థించాడు. టీ20 సిరీస్‌ మధ్యలో సహచరులు వెనక్కి రావడానికి మద్దతు పలికాడు. ప్రపంచకప్‌ జైత్రయాత్ర తర్వాత తమ ఆటగాళ్లకు విశ్రాంతి కావాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ కోసం సర్వశక్తులు ధారపోసి.. ఆ తర్వాత మరికొన్ని మ్యాచ్‌లు ఆడటానికి వారేమీ రోబోలు కాదని కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. వారి నిర్ణయాన్ని తాను వ్యతిరేకించనని తెలిపాడు. భారత జట్టులో కూడా మూడో టీ20 మ్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ చేరనున్నాడు.



మిగిలిన మూడు టీ20 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా జట్టు మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టీమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్ ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న అయిదు టీ 20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను సొంతం చేసుకున్న టీమిండియా... సిరీస్‌పై కన్నేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే గెలవాలని పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్‌.. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక గువాహటిలో జరిగే నేటి మ్యాచ్‌లో భారత్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. తిలక్‌ వర్మకు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారనుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అనుకున్నంత మేర రాణించలేకపోయిన తిలక్‌ వర్మ ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత వారం రోజులపాటు విశ్రాంతి తీసుకున్న శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌ తర్వాత తిరిగి జట్టులోకి రానున్నాడు. రాయ్‌పూర్, బెంగళూరుల్లో జరిగే చివరి రెండు మ్యాచుల్లో అయ్యర్‌ బరిలోకి దిగుతాడు. అయ్యర్ ప్లేయింగ్ లెవన్‌లోకి వస్తే తిలక్‌వర్మపై వేటు పడే అవకాశం ఉంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply