Asia Cup 2025 SL Easy Victory VS Ban Latest Updates : ఆసియాకప్ లో శ్రీలంక సత్తా చాటింది. బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆరు వికెట్లతో సునాయాస విజయం సాధించింది. అబుధాబిలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 139 పరుగులు చేసింది. షమీమ్ హుస్సేన్ (34 బంతుల్లో 42 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వనిందు హసరంగా రెండు వికెట్లతో రాణించాడు. అనంతరం ఛేజింగ్ ను కేవలం 14.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లకు 144 పరుగులు చేసి, లంక కంప్లీట్ చేసింది. ఓపెనర్ పతుమ్ నిసాంక స్టన్నింగ్ ఫిఫ్టీ (34 బంతుల్లో50, 6 ఫోర్లు, 1 సిక్సర్) తో సత్తా చాటి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. మెహదీ హసన్ కు రెండు వికెట్లు దక్కాయి. అద్బుత బ్యాటింగ్ తో రాణించిన మిషారాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తమ తర్వాతి మ్యాచ్ ల్లో హాంకాంగ్ తో సోమవారం (ఈనెల 15న) శ్రీలంక, మంగళవారం ఆఫ్గానిస్థాన్ తో బంగ్లాదేశ్ తలపడున్నాయి.
పీకల్లోతు కష్టాల్లో..టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన బంగ్లాకు షాక్ తగిలింది. ఓపెనర్లు తంజిద్ మసన్, పర్వేజ్ హసన్ ఈమన్లు డకౌటయ్యారు. తౌహిద్ హృదయ్ (8), మెహదీ హసన్ (9)తో పాటు కుదురుగా ఆడుతున్న కెప్టెన్ లిటన్ దాస్ (28) దాస్ కూడా వెనుదిరగడంతో ఒక దశలో 53-5తో దయనీయ స్థితిలో నిలిచింది. ఈ దశలో జాకీర్ అలీ (41 నాటౌట్) తో కలిసి షమీమ్ జాదూ చేశాడు. ఒత్తిడిని ఎదుర్కొని, ఎదురు దాడికి దిగుతూ స్కోరు బోర్డును వీరిద్దరూ పరుగులెత్తించారు. ఈక్రమంలో అబేధ్యమైన ఆరో వికెట్ కు 86 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో లంక ముందు కాస్త చాలెంజింగ్ స్కోరును బంగ్లా ఉంచగలిగింది.
నిసాంక దూకుడు..ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన లంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (3) త్వరగా ఔట్ కాగా, కమిల్ మిషారా (32 బంతుల్లో 46 నాటౌట్) తో కలిసి నిసాంక చక్కని భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. వీరద్దరూ దూకుడుగా ఆడటంతో బంగ్లా బౌలర్లు కాస్త బెంబేలెత్తి పోయారు. ఇదే జోరులో నిసాంక 31 బంతుల్లో ఫిఫ్టీ చేసుకుని, ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్ కు నమోదైన 95 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కుశాల్ పెరీరా (9), దాసున్ శనక (1) విఫలమైనా, కెప్టెన్ చరిత్ అసలంకా (10 నాటౌట్) తో కలిసి మిషారా జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో గ్రూప్-బిలో లంక రెండో స్తానానికి చేరుకుంది.