Asia Cup 2025 Ind vs Pak Latest Updates : ఆసియాకప్ లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యాచ్ కు రంగం సిద్దమైంది. దాయాది దేశాలు ఇండియా, పాకిస్థాన్ ఆదివారం దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. పహాల్గాం ఉదంతం జరిగిన తర్వాత ఇరుదేశాలు క్రికెట్లో తలపడటం ఇదే తొలిసారి. దీంతో ఈసారి మ్యాచ్ కు ఎమోషనల్ టచ్ కూడా అద్దుకున్నట్లయ్యింది. ఇక ఇరువైపులా సీనియర్ ప్లేయర్లు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా భారత్, బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సేవలు పాక్ కు అందుబాటులో ఉండటం లేదు. ఇక ఇరుజట్లు టోర్నీలో తొలి మ్యాచ్ ఆడి ఉండటంతో కూర్పుపై ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుందని తెలుస్తోంది.
పటిష్టంగా భారత్..
నిస్సందేహంగా ఈ మ్యాచ్ లో భారతే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇటీవల ఫామ్ తోపాటు అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న ట్రాక్ రికార్డు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తొలి మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే ఇండియా ఆడబోతోన్నట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా శుభమాన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. అయితే ఇంజ్యూరీతో గిల్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తను అందుబాటులో లేకపోతే, అతని స్థానంలో సంజూ శాంసన్ ఆడతాడు. మిడిలార్డర్లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తో పటిష్టంగా ఉంది. ఒకవేల గిల్ ఆడకపోతే, ద్రువ్ జురెల్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో ఏకైక స్పెషలిస్టు పేసర్ గా జస్ ప్రీత్ బుమ్రా ఆడతాడు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగడం ఖాయమే. మూడో స్పిన్నర్ గా అక్షర్, అదనపు పేసర్లుగా హార్దిక్, దూబే తలో చేయి వేయవచ్చు. పుల్ పవర్ తో ఉన్న టీమిండియాను నిలువరించడం పాక్ కు కత్తిమీద సామే.
అనుభవ రాహిత్యం..
ఇక ఇటీవల పూర్తి స్తాయి జట్టుతో బరిలోకి దిగినా, అనామక జట్ల చేతిలో పాక్ ఓడిపోతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో యూఎస్ ఏ చేతిలో, ఇటీవల జింబాబ్వే, వెస్టిండీస్ చేతిలోనూ పాక్ ఓడిపోయింది. బాబర్, రిజ్వాన్ సహా కొంతమంది ప్లేయర్లు దూరం కావడంతో పాక్ మరింత బలహీనంగా కనిపిస్తోంది. పటిష్టమైన భారత్ ను నిలువరించడం పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు సవాలే. ఏదేమైనా ఈ మ్యాచ్ లో కనీసం ఉనికి చాటు కోవాలని పాక్ ఆశిస్తోంది. ఈ స్టేడియంలో సగటు స్కోరు 150 దగ్గరగా ఉంటోంది. ఛేజ్ చేసిన జట్లే ఎక్కువగా గెలుపొందాయి కాబట్టి, టాస్ గెలిచిన జట్టు, బౌలింగ్ ఎంచుకునే అవకాశముంది.
టీమిండియా (అంచనా): అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్, సంజు సాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్ (అంచనా): సహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అశ్రఫ్, షాహీన్ షా అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.