Viral Stage Video Sparks Speculation Between Kerala Stars: కేరళ క్రికెట్ లీగ్ 2026 ఫైనల్ బహుమతుల ప్రదానోత్సవ వేదికపై జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచనలంగా మారింది. కేరళకు చెందిన ఇద్దరు స్టార్ క్రికెటర్లు సంజూ శాంసన్, ఎస్ శ్రీశాంత్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయంటూ ఒక వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వేడుకలో ట్రోఫీ పక్కనే సంజూ శాంసన్ ఇతర అధికారులతో కలిసి నిలబడి ఉండగా, శ్రీశాంత్ వేదికపైకి వచ్చాడు. అక్కడ ఉన్న నిర్వాహకులు, అధికారులందరికీ చేతులు కలిపిన శ్రీశాంత్, సరిగ్గా తన పక్కనే ఉన్న సంజూ శాంసన్‌కు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ముందుకు సాగిపోయాడు. సంజూ కూడా శ్రీశాంత్ వైపు చేయి చాచకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఈ విజువల్స్ బయటకు రావడంతో వీరిద్దరి మధ్య అంతర్గత వివాదం ఏమైనా మొదలైందా అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిపై ఇరు ఆటగాళ్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం విశేషం.
నిలకడ లేదు..మరోవైపు టీమ్ ఇండియా మాజీ ఓపెనర్, దేశవాళీ దిగ్గజం వసీం జాఫర్ సంజూ శాంసన్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. దూరదర్శన్ వేదికగా ప్రసారమైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన జాఫర్, 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో బ్యాకప్ ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను తాను చూడటం లేదని తెలిపాడు. శాంసన్‌లో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే ప్రతిభ ఉన్నప్పటికీ, వన్డే ఫార్మాట్ డిమాండ్ చేసే నిలకడ అతడిలో లోపించిందని తెలిపాడు. క్రీజులో ఎక్కువ సమయం గడపాల్సిన 50 ఓవర్ల ఫార్మాట్‌కు సంప్రదాయ సాంకేతికత, క్రమశిక్షణతో కూడిన గేమ్ ప్లాన్ చాలా అవసరమని వివరించాడు.
ఆ ఫార్మాటే బెస్ట్.."2027 ప్రపంచకప్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా సంజూ సరిపోతాడని నేను అనుకోవడం లేదు. అతడి ఆటతీరులో కన్సిస్టెన్సీ లోపించింది. వన్డే క్రికెట్లో నిలకడ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇక్కడ బ్యాటర్లకు భారీ ఇన్నింగ్స్‌లు నిర్మించే సమయం లభిస్తుంది. సంజూ తన గత వన్డేలో సెంచరీ బాదిన మాట నిజమే అయినా, ఇప్పటికే అతడికి తగినన్ని అవకాశాలు వచ్చాయి. ఇండియా వద్ద శాంసన్ కంటే మెరుగైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అతడిని కేవలం టీ20 ఫార్మాట్‌కే ఆడనివ్వడం మంచిది" అని జాఫర్ పేర్కొన్నాడు.
తీవ్రమైన పోటీ..రాబోయే వన్డే ప్రపంచకప్ కోసం భారత యాజమాన్యం సరైన కాంబినేషన్లను సిద్ధం చేస్తున్న వేళ, బ్యాకప్ స్థానాల కోసం దేశవాళీ క్రికెట్ నుంచి ఎందరో కుర్రాళ్లు జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీ యాంశంగా మారాయి.
