సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బ తగిలింది. కీలకమైన రెండో టెస్టుకు ముందు ఆ జట్టు కీలక ఆటగాడు గెరాల్డ్ కొట్జీ దూరమయ్యాడు. తొలి టెస్టు సందర్భంగా గాయపడిన గెరాల్డ్ కొట్జీ జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది. అతడి స్థానంలో పేసర్లు ఎంగిడి, ముల్డర్‌లతో పాటు స్పిన్నర్ కేశవ్ తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్ బవుమా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. తొలి టెస్టు తొలి రోజే ఫీల్డింగ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో బవుమా మైదానం వీడాడు. రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న ఎల్గర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
డీన్ ఎల్గర్‌కు సారధ్య బాధ్యతలు
సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారీ శతకంతో దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన డీన్ ఎల్గర్ (Dean Elgar)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సిరీస్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎల్గర్ వీడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే ప్రొటీస్ కెప్టెన్ బవుమా గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరం కావడంతో.. అతని స్థానంలో ఎల్గర్ దక్షిణాఫ్రికా కెప్టెన్ (South Africa Captain Dean Elgar)గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్‌కు తన కెరీర్ ఆఖరి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. కెప్టెన్ తెంబా బవుమా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో క్రికెట్ దక్షిణాఫ్రికా.. సారథ్య బాధ్యతలను ఎల్గర్‌కు అప్పగించింది. బవుమా స్థానంలో జుబేర్ హంజాను జట్టుకు ఎంపిక చేసింది. భారత్‌తో సిరీస్‌తో రిటైరవుతున్నట్లు ఎల్గర్ ముందే ప్రకటించాడు. గాయంతో బవుమా మైదానాన్ని వీడడంతో తొలి టెస్టులోనూ ఎల్గర్ సారథిగా వ్యవహరించాడు. భారత జట్టు 2021-22లో దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ఎల్గర్ కెప్టెన్సీలోనే 2-1తో సిరీస్ గెలిచింది.
భారత జట్టులో ఆవేశ్‌ఖాన్
వన్డేలు, టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన యువ బౌలర్ అవేశ్ ఖాన్‌కు టెస్టుల్లోకి పిలుపొచ్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు కోసం సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో జట్టులోకి అవేశ్‌ఖాన్ ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్ కోసం ఫిట్‌నెస్ సాధించని మహమ్మద్ షమీ స్థానంలో ఇప్పటిదాకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇప్పుడు కేప్‌టౌన్ వేదికగా జరగనున్న రెండో టెస్టు కోసం షమీ స్థానంలో అవేశ్‌కు చోటు కల్పించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిటెస్టులో ఘోరంగా ఓడిన భారత్ రెండు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడి ఉంది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి ఆరంభంకానుంది. మరోవైపు వెన్ను నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరమైన భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్టుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో ఆడేందుకు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. రెండో టెస్టులో జడేజా ఆడితే.. బ్యాటర్‌గానూ రెండో స్పిన్నర్‌గానూ జట్టుకు ఉపయోగపడతాడు. తొలిటెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ధకృష్ణ, శార్దూల్ ఠాకూర్ స్థానంలో అవేశ్‌ఖాన్, రవీంద్ర జడేజా తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది.