India Position In wtc Table: ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోకి తొలిసారి దక్షిణాఫ్రికా ప్రవేశించింది. ఆదివారం ముగిసిన తొలి టెస్టులో 2 వికెట్లతో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే, ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక ఇప్పుడు రెండో బెర్త్ కోసం ప్రధానంగా ఫైట్ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. నాలుగో టెస్టు ఫలితం రేపు తేలనుంది. దీనిపైనే భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
కనీసం సిరీస్ డ్రా చేసుకోవాలి..
డబ్ల్యూటీసీ ఫైనల్లోకి ప్రవేశించాలంటే టీమిండియా కనీసం ప్రస్తుత బీజీటీని 2-2తో డ్రా చేసుకోవాలి. అంటే చివరి రెండు టెస్టులను డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సిరీస్ ను 2-1తో గెలిస్తే భారత్ కు మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో ఆసీస్ కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా ఓడిపోతే సరిపోతుంది. ఇక సిరీస్ ను భారత్ ఓడిపోతే మాత్రం కథ కంచికి చేరిపోతుంది. మరోవైపు ఆసీస్ ఫైనల్ కు చేరుకోవాలంటే భారత సిరీస్ ను కనీసం డ్రా చేసుకోవడంతోపాటు లంకతో సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తే చాలు. వరుసగా రెండోసారి ఫైనల్ బెర్తు దక్కించుకుంటుంది.
తొలిసారి ఫైనల్లోకి ప్రొటీస్..
అద్భుత విజయాలతో సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్లోకి ప్రవేశించింది. సొంతగడ్డపై సెంచూరియాన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో స్టన్నింగ్ విక్టరీతో ఈ ఫీట్ సాధించింది. మొత్తానికి 11 మ్యాచ్ లాడిన ప్రొటీస్.. ఏడింటిలో గెలుపొంది, మూడింటిని ఓడిపోయి, ఒక మ్యాచ్ ను డ్రా చేసుకుంది. 66.67 తిరుగులేని పాయింట్ పర్సెంటేజీతో మెగాటోర్నీ ఫైనల్ కు చేరుకుంది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (58.89), మూడో స్థానంలో ఉన్న భారత్ (55.388) కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఇక, న్యూజిలాండ్ తో సొంతగడ్డపై సిరీస్ లో క్లీన్ స్వీప్ తో చేజేతులా ఫైనల్ అవకాశాలను భారత్ పోగొట్టుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాలు వికటించడంతోనే ఈ స్థితి దాపురించిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ అర్హత సాధించకపోతే, అటు సారథ్యంతోపాటు ఇటు టెస్టు కెరీర్ కు ఎండ్ కార్డు పడే అవకాశాలున్నాయి. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్న లంక, కివీస్ లకు ఫైనల్ బెర్తుకు ఆమడ దూరంలో ఉన్నాయి. ఆల్మోస్ట్ వీటి కథ ముగిసిపోయినట్లే.