ICC Women World Cup 2025 INDW Vs NZW: భారత మహిళల క్రికెట్ జట్టు ICC వన్డే ప్రపంచ కప్‌లో మూడు ఓటముల తరువాత విజయం సాధించింది.  డి.వై పాటిల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచులో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధానా సెంచరీతో చెలరేగి పలు రికార్డులు తన పేరిట లిఖించుకుంది. మంధానా 95 బంతుల్లో 109 పరుగులు చేసి 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదింది. ఈ ఇన్నింగ్స్‌తో స్మృతి మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది. ఆమెతో పాటు మరో ఓపెనర్ ప్రతీకా రావల్ సెంచరీ ఇన్నింగ్స్‌లతో టీమ్ ఇండియా సెమీ స్ వైపు అడుగులు వేసింది. 

Continues below advertisement

పలు రికార్డులు బద్దలు కొట్టిన మంధానా

స్మృతి మంధానా ఈ అద్భుతమైన సెంచరీతో పలు రికార్డులు సాధించింది. ఆమె ఏయే రికార్డులు సాధించిందో తెలుసుకుందాం.

Continues below advertisement

14వ వన్డే సెంచరీ: తన వన్డే కెరీర్‌లో స్మృతి మంధానా 14వ సెంచరీ సాధించింది. దీంతో మంధానా న్యూజిలాండ్ సూజీ బేట్స్ (13 సెంచరీలు)ను అధిగమించి ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లానింగ్ (15 సెంచరీలు) తర్వాత రెండో స్థానానికి చేరుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు:  అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్‌లలో స్మృతి మంధానాకు (టెస్ట్, వన్డే, టీ20) మొత్తం 17వ సెంచరీ ఇది. ఈ ఘనతతో ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీల పరంగా మెగ్ లానింగ్‌తో సమానంగా నిలిచింది.

ప్రపంచ కప్‌లో 3వ సెంచరీ: ప్రపంచ కప్ 2025లో ఇది మొదటి సెంచరీ, కాగా మొత్తం ప్రపంచ కప్‌లలో స్మృతి మంధానాకు ఇది మూడో సెంచరీ. ఈ సెంచరీతో వరల్డ్ కప్ శతకాలలో ఆమె భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో సమానంగా నిలిచింది.

ప్రపంచ కప్‌లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం: మంధానా తన ఓపెనింగ్ భాగస్వామి ప్రతీకా రావల్‌తో కలిసి 212 పరుగులు జోడించి మహిళల ప్రపంచ కప్‌లో భారత్ తరపున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం సైతం నెలకొల్పింది.

వన్డేలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సర్లు: ఈ ఏడాది స్మృతి మంధానా ఇప్పటివరకు 29 సిక్సర్లు కొట్టింది. ఆమె 2017లో 28 సిక్సర్లు కొట్టిన దక్షిణాఫ్రికాకు చెందిన లిజెల్ లీ రికార్డును బద్దలు కొట్టింది.