Smriti Mandhana Reacts After RCB Win: ఐపీఎల్(IPL) ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) బరిలో దిగినప్పటి నుంచి వినిపిస్తున్న ఒకే మాట. ఈ సాలా కప్ మనదే అంటూ హంగామా చేసి.... తీరా కీలక మ్యాచ్‌లలో ఓడిపోతూ పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ విజేత కలను ఉమెన్స్ ప్రీమియర్‌ల లీగ్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. కోహ్లీ, డివిలియర్స్ సహా దిగ్గజ ఆటగాళ్లతో చాలా పటిష్టంగా కనింపించిన RCB... ఐపీఎల్‌లో ప్రతీసారి టైటిల్ ఫేవరెట్‌గానే బరిలోకి దిగేది. కానీ విరాట్ కోహ్లీ(Virat kohli), అనిల్ కుంబ్లే(Anil Kumble), ఏబీ డివిలియర్స్(ABD), ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజాలు.. ఈ కలను సాకారం చేయలేకపోయారు. దాదాపుగా 16 ఏళ్లుగా దిగ్గజ క్రికెటర్లకు సాధ్యంకాని కలను ఆర్సీబీ అమ్మాయిలు సాకారం చేశారు. దశాబ్దంన్నర కాలంగా పురుషుల జట్టు సాధించలేకపోతున్న ట్రోఫీ కలను.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి నిజం చేశారు. ఈ చారిత్రక విజయంపై తొలిసారి బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన స్పందించింది.
స్మృతి ఏమందంటే...
ఆర్సీబీ ఉమెన్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఈసాలా కప్ నమదే నినాదంపై స్పందించింది. ఇప్పుడు తన ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేనని తెలిపింది. తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నానని భావోద్వేగానికి గురైంది. సరైన సమయంలో సమష్టిగా రాణించి అద్భుతం సృష్టించామని మంధాన తెలిపింది. గత సీజన్ ఓటమి నుంచి ఠాలు నేర్చుకుని.. ఈ సీజన్‌లో రాణించామని తెలిపింది. తమ ఫ్రాంఛైజీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఇది మీ టీమ్.. మీ ఇష్టమున్న నిర్ణయాలు తీసుకోండని చెప్పిందని తెలిపింది. ఈ టైటిల్ ఆర్సీబీకి ఎంతో విలువైందన్న స్మృతి.... ట్రోఫీ గెలిచింది తాను కాదని.. ఇది జట్టు విజయమని తెలిపింది. ప్రతిసారి ఈసాలా కప్ నమదే అని నినదించే అభిమానులకు స్మృతి చక్కటి సందేశాన్ని ఇచ్చింది. ఈసాలా కప్ మనదే అని గర్వంగా చెప్పండి. తనకు కన్నడ మరీ అంత గొప్పగా ఏమీ రాదని... కానీ ఫ్యాన్స్‌కు ఈ మెసేజ్ ఇవ్వడం ముఖ్యమని స్మృతి మంధాన పేర్కొంది.
వీడియోకాల్‌లో అభినందనలు
మహిళల జట్టు టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ ప్లేయర్లతో కింగ్ కోహ్లీ వీడియో కాల్ చేసి మాట్లాడాడు. కెప్టెన్ స్మృతి మంధానతో కాసేపు మాట్లాడిన ఈ స్టార్ బ్యాటర్... అనంతరం ఇతర ప్లేయర్లతో కూడా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తమ ఫ్రాంచైజీకి డబ్ల్యూపీఎల్ టైటిల్ దక్కడంతో ఐపీఎల్ ఆర్‌సీబీ స్టార్స్ విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాజీ సభ్యులు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మాజీ యాజమాని విజయ్ మాల్యా తదితరులు అభినందనలు తెలిపారు.
అభిమానుల సంబరాలు
ఈ సాలా కప్ మనదే అని ప్రతి ఏటా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఈసాలా కప్ దక్కడంతో ఎక్కడా ఆగడం లేదు. కోట్లాది మంది అభిమానుల కల నెరవేరడంతో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. కంగ్రాచ్యులేషన్ ఆర్సీబీ.. ఈసాలా కప్ మనదే.. ఈసాలా కప్ నమదే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు