Team India News: వేదిక అడ్వాంటేజీ వాదనను తోసి పుచ్చిన భారత్ కోచ్.. టీమిండియా అలా ఆడి గెలిచిందని స్పష్టీకరణ
భద్రతా కారాణాలతో ఆతిథ్య పాకిస్థాన్ లో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి భారత్, పాక్ మధ్య హైబ్రీడ్ మోడల్ ను తెరపైకి తెచ్చింది. దీంతో దుబాయ్ లో భారత్ ఆడుతోంది.
ICC Champions Trophy 2025 Latest Updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఒకే వేదికపై ఆడతూ భారత జట్టు అడ్వాంటేజీ పొందుతున్న వాదనను భారత బ్యాటింగ్ కోచ్ సీతాన్షూ కోటక్ కొట్టి పారేశాడు. ఒకే వేదికపై మ్యాచ్ లు ఆడినంత మాత్రాన అడ్వాంటేజీ ఏముంటుందని వ్యాఖ్యానించాడు. నిజానికి భద్రతా కారాణాలతో మెగాటోర్నీ ఆతిథ్య పాకిస్థాన్ లో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగి భారత్, పాక్ మధ్య హైబ్రీడ్ మోడల్ ను తెరపైకి తెచ్చింది. దీని ఫలితంగా భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ లో జరుగుతాయి.
ఒకవేళ నాకౌట్ దశకు చేరితే ఆ మ్యాచ్ లను కూడా దుబాయ్ లోనే నిర్వహించాలనే ముందుగా ఒప్పందం చేసుకున్నారు. దీనికి బదులుగా పాక్ కు ఒక మహిళా మెగాటోర్నీ ఆతిథ్య హక్కుల్ని కట్టబెట్టడంతోపాటు భవిష్యత్తులో భారత్ లో ఏదైనా టోర్నీ జరిగితే పాక్ కూడా హైబ్రీడ్ మోడల్లో ఆ టోర్నీలో బరిలోకి దిగేలా ఒప్పందం కుదిరింది. అయితే భారత్ తాజాగా ఫైనల్ కు చేరడంతో చాలామంది దుబాయ్ వేదికతో అడ్వాంటేజీ ఉందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
గతంలోనే నిర్ణయించారు..
భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే నిర్వహించాలనే విషయాన్ని ఎప్పుడో ఖరారు చేశారని, ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని కోటక్ తెలిపాడు. భారత్ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి వారికి అనుకూలంగా మారిందని వాదించేవారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు ఒకచోట ప్రాక్టీస్ చేసి, మరో చోట మ్యాచ్ లు ఆడుతోందని గుర్తు చేశాడు. ఎండ్ ఆఫ్ ది డే ఈ జట్టు బాగా ఆడితే, ఆ జట్టే విజయం సాధిస్తుందని, అదృష్టంతో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలవలేరని చురకలు అంటించాడు. వన్డే క్రికెట్ లో రోజుమొత్తం మంచి క్రికెట్ ఆడితేనే గెలిచేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నాడు.
మూడో టైటిల్ పై గురిపెట్టిన భారత్..
మరోవైపు తాము దుబాయ్ లో ఆడటానికి వచ్చిన తర్వాత పరిస్థితులేమీ మారిపోలేదని కోటక్ అన్నాడు. ఇక మ్యాచ్ లు దుబాయ్ లో జరిగిన్పటికీ, ఆతిథ్య దేశం హోదాలో పిచ్ రూపకల్పన మొత్తం పాక్ చేతిలోనే ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే సెమీస్ లో కాస్త బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. అంతకుముందు న్యూజిలాండ్ తో జరిగిన పిచ్ బ్యాటింగ్ కు కష్ట సాధ్యంగా ఉంటే, ఈ పిచ్ మాత్రం కాస్త ఈజీగా బ్యాటింగ్ చేసే లాగా ఉందని పలువురు వాదిస్తున్నారు.
ఇక పిచ్ రూపకల్పనలో పాక్ క్యూరేటర్లు ఆసీస్ కు చెందిన క్యూరేటర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ, వివిధ రకాలైన పిచ్ లపై ఆడుతూ, వరుసగా నాలుగు విజయాలు సాధించిన భారత్ ను క్రికెట్ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. ఆదివారం జరిగే మ్యాచ్ లో కూడా విజయం సాధించి మూడోసారి టోర్నీని నెగ్గిన ఏకైక జట్టుగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.