WPL 2025 GG Vs DC Latest Live Updates: డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ ముంగిట నిలిచింది. మరొక్క విజయం సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. శుక్రవారం టేబుల్ టాపర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాకిచ్చి, ఏకంగా రెండో ప్లేస్ కు చేరుకుంది. లక్నోలో జరిగిన ఈ లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 177 పరుగులు చేసింది. మెగ్ ల్యానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (57 బంతుల్లో 92, 15 ఫోర్లు, 1 సిక్సర్) తో చివరికంటా నిలిచి త్రుటిలో సెంచరీ చేజార్చుకుంది. బౌలర్లలో మేఘన సింగ్ కు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం ఛేజింగ్ ను 19.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 178 పరుగులతో పూర్తి చేసిన గుజరాత్, ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ అజేయ ఫిఫ్టీ (49 బంతుల్లో 70 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్సర్)తో తుదికంటా నిలిచి జట్టుకు విజయాన్ని సాధించి పెట్టింది. బౌలర్లలో జెస్ జొనసెన్, శిఖా పాండేలకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో దాదాపుగా ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకున్నట్లే. అలాగే యూపీ వారియర్జ్ జట్టు.. టోర్నీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఇక డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ మిగతా రెండు మ్యాచ్ ల్లో భారీ విజయాలు సాధిస్తేనే, నాకౌట్ రేసులో నిలుస్తుంది. లేకపోతే ఆ జట్టు కూడా రేసు నుంచి నిష్క్రమిస్తుంది. శనివారం జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ తో యూపీ తలపడుతుంది. హర్లీన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ల్యానింగ్ దూకుడు..
ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ ప్లేసుతో ఏకంగా ఫైనల్ కు చేరుకుందామని భావించిన ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి. ఓపెనర్లు ల్యానింగ్, షెఫాలీ వర్మ (27 బంతుల్లో 40, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మంచి పునాది వేసినప్పటికీ, మిడిలార్డర్ బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారు. జెస్ జొనసెన్ (9), జెమీమా రోడ్రిగ్స్ (4), మారిజానే కాప్ (7) అటు బ్యాటింగ్ లో విఫలమై, ఇటు బంతులు కూడా వేస్ట్ చేశారు. మధ్యలో అన్నాబెల్ సదర్లాండ్ (14) కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యింది. అయితే చివరి ఓవర్ వరకు నిలిచిన ల్యానింగ్ .. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ, 35 బంతుల్లోనే ఫిప్టీ పూర్తి చేసుకుంది. అయితే ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు రెండు షాట్లు కొడితే సెంచరీ పూర్తవుతుందనే దశలో తను ఔటయ్యింది. మిగతా బౌలర్లలో డియెండ్ర డాటిన్ కు రెండు వికెట్లు లభించాయి..
సూపర్ భాగస్వామ్యం..
ఛేజింగ్ లో గుజరాత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డయలాన్ హేమలత (1) త్వరగా ఔటైంది. అయితే మరో ఓపెనర్ బేత్ మూనీ (35 బంతుల్లో 44, 6 ఫోర్లు) తో కలిసి హర్లీన్ జట్టును ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మెరుగ్గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధించారు. దీంతో రెండో వికెట్ కు 85 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మూనీ ఔటైనా, తర్వాత బ్యాటర్లతో కలిసి హర్లీన్ ఛేదనను పూర్తి చేసింది. డియోండ్ర (24), కెప్టెన్ యాష్లే గార్డెనర్ (22) హర్లీన్ కు చక్కని సహకారం అందించడంతో ఛేజింగ్ చక్కగా సాగింది. చివర్లో మూడు వికెట్లు పడిపోయి కాస్త ఉత్కంఠ రేగినా, హర్లీన్ చివరికంటా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. ఈ క్రమంలో 38 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. గత రెండు సీజన్లలో అట్టడుగు స్థానంలో నిలిచిన గుజరాత్, ఈసారి మాత్రం తొలిసారి ఫ్లే ఆఫ్స్ రుచి చూడబోతుందని ఆ జట్టు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఢిల్లీ బౌలర్లలో మిన్ను మణికి ఒక వికెట్ దక్కింది.