మూడేళ్ల తర్వాత నిర్వహించిన బీసీసీఐ(BCCI) అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌(Hyderabad)లో ఘనంగా జరిగింది. యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) 2022-2023 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా పాలి ఉమ్రిగర్‌ అవార్డును అందుకున్నాడు. గత ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న గిల్‌... ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఈ ఘనతలకు గుర్తుగా బీసీసీఐ గిల్‌కు 2022-2023 ఏడాదికిగానూ పాలి ఉమ్రిగర్‌ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తర్వతా గిల్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

 

ఇంతకీ గిల్‌ ఏమన్నాడంటే...

శుభమన్‌ గిల్ ఎనిమిదేళ్ల క్రితం విరాట్ కోహ్లీ(Virat Kohli)తో కలిసి అవార్డు వేడుకలో పాల్గొన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 14 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు బీసీసీఐ అవార్డుల వేడుకకు వచ్చానని... ఇక్కడ తన దిగ్గజ ఆటగాళ్లను.. తనకు ప్రేరణగా నిలిచిన వాళ్లని... స్ఫూర్తి పంచిన వాళ్లని కలిశానని గిల్‌ ఆ పోస్ట్‌లో రాశాడు. ఆ ఏడాది విరాట్ కోహ్లీ భాయ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును అందుకున్న క్షణాలను తన జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని గిల్‌ అన్నాడు. తాను ఒక్కో అడుగు ముందుకేసి ఈ స్థితికి చేరుకోడానికి తనకు ప్రేరణ ఇచ్చింది కోహ్లీనే అని గిల్‌ పేర్కొన్నాడు. ఈ  ఏడాది దేశం కోసం మరింత బాగా రాణిస్తానని గిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు.

 

భీకర్‌ ఫామ్‌లో యువ ఓపెనర్

2023లో అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌.. అరుదైన రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టాడు. భారత్ తరఫున ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 1998లో క్రికెట్ గాడ్ సచిన్‌ 1894 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ రెండో స్థానంలో ఉన్నాడు. గంగూలీ 1999లో 1767 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో ఉండగా ది వాల్‌ 1761 పరుగులు చేశాడు. సచిన్ మళ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 1996లో మరోసారి మాస్టర్ బ్లాస్టర్‌ 1611 పరుగులు చేశాడు. శుభ్‌మన్ ఈ ఏడాది వన్డేల్లో 1500 పరుగులు చేశాడు. ఈ విషయంలో రోహిత్, కోహ్లిలను గిల్‌ వెనక్కినెట్టాడు. 2019లో రోహిత్ 1490 పరుగులు చేయగా.. 2017లో కోహ్లీ 1460 పరుగులు చేశాడు. వీరిద్దరిని అధిగమించి గిల్‌ 1500 పరుగులు చేసి సత్తా చాటాడు.

 

గిల్‌తో పాటు వీళ్లు కూడా...

2019-2020 ఏడాదికిగాను మహ్మద్‌ షమీ... 2020-2021 ఏడాదికిగాను మహ్మద్‌ షమీ... 2021-2022 ఏడాదికిగాను పేసు గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా పాలి ఉమ్రిగర్‌ అవార్డును అందుకున్నాడు. మహిళల విభాగంలో స్మృతి మంధాన, దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళ క్రికెటర్‌ అవార్డును గెలుచుకున్నారు.  2020-21, 2021-22 ఏడాదులకుగాను  స్మృతి మంధాన … 2019-2020, 2022-23 ఏడాదులకుగాను  దీప్తి శర్మ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ అవార్డును గెలుచుకున్నారు. ఇంకా అనేక విభాగాల్లో క్రికెటర్లకు అవార్డులను అందించారు. మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, ఫరూఖ్‌ ఇంజినీర్‌.. సీకే నాయుడు జీవితకాల సాఫల్య అవార్డులు స్వీకరించారు. అవార్డుల కార్యక్రమానికి ఇంగ్లాండ్‌ సహాయ సిబ్బంది కూడా హాజరయ్యారు.