Shreyas Iyer, Ishan Kishan: రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి దూరంగా ఉన్న భారత ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan), శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer)పై బీసీసీఐ( BCCI ) కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ టోర్నమెంట్‌లో పాల్గొనని వీరిద్దరిని 2023-24 సీజన్‌ కేంద్ర కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇషాన్‌, అయ్యర్‌ భిన్నమైన కారణాలతో రంజీ ట్రోఫీలో ఆడలేదు. ఐపీఎల్‌ కోసం తన టెక్నిక్‌పై పని చేస్తున్నానని ఇషాన్‌ చెప్పగా.. వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు అయ్యర్‌ తెలిపాడు. అయితే ఇషాన్‌, అయ్యర్‌ వ్యవహార శైలి పట్ల సంతృప్తిగా లేని బీసీసీఐ వీరిద్దరికి సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తొలగించాలని చూస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరి పేర్ల‌ను తొల‌గించ‌నున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. బీసీసీఐ ఇస్తున్న సెంట్రల్ కాంట్రాక్ట్ 2023లో శ్రేయ‌స్ అయ్య‌ర్ గ్రేడ్ బిలో ఉండ‌గా ఇషాన్ కిష‌న్ గ్రేడ్ సిలో ఉన్నారు. ఈక్రమంలో శ్రేయ‌స్ రూ.3 కోట్ల వార్షిక వేత‌నాన్ని పొందుతుండ‌గా ఇషాన్ కోటి జీతం అందుకుంటున్నాడు. బోర్డు ఆదేశాల‌ను వీరిద్దరు బేఖార‌తు చేస్తూ రంజీల్లో ముంబైకి అయ్యర్‌, జార్ఖండ్‌కు కిష‌న్ అందుబాటులో ఉండ‌డం లేదు. అతి త్వర‌లోనే బీసీసీఐ 2024కు సంబంధించిన కాంట్రాక్ట్స్‌ల‌ను ప్రకటించ‌నుంది. 

 

అజిత్‌ అగర్కార్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ 2023-24 సీజన్‌ కోసం ఆటగాళ్ల కేంద్ర కాంట్రాక్టు జాబితాను దాదాపు ఖరారు చేసింది. త్వరలోనే బీసీసీఐ ఆ జాబితాను ప్రకటించనుంది. కిషన్‌, అయ్యర్‌ను జాబితా నుంచి తప్పించే అవకాశముందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున సత్తాచాటిన ఆటగాళ్లలో ఒకడైన అయ్యర్‌ను రంజీ మ్యాచ్‌ ఆడలేదన్న కారణంతో పక్కనబెట్టకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

 

ఇషాన్‌ కనిపించాడు

టీమిండియా(Team India) బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan) చాలా రోజుల తర్వాత కనిపించాడు.  రెండు నెలల క్రితం వ్యక్తిగత కారణాలు చెప్పి దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ఇషాన్‌ కిషన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించాడు. కొద్దిరోజులుగా బరోడాలోని టీమిండియా మాజీ ఆటగాడు కిరణ్‌ మోరే అకాడమీలో ఇషాన్‌ శిక్షణ పొందుతున్నాడు. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా( Hardik Pandya), అతడి సోదరుడు కృనాల్‌ పాండ్యా కూడా ఇదే అకాడమీలో ట్రైనింగ్‌ అయ్యారు. మూడు వారాలుగా కిరణ్‌ మోరే అకాడమీలోనే ఉంటున్న ఇషాన్‌.. జిమ్‌లో ట్రైనింగ్‌ అవుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాతో కలిసి ఇషాన్‌ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇషాన్‌, హార్దిక్‌ ఇద్దరూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్నారు. గత ఏడాదంతా విరామం లేకుండా జట్టుతో ప్రయాణం చేసిన ఇషాన్‌ కిషన్‌.. తుది జట్టులో ఆడింది మాత్రం చాలా తక్కువ. ఎవరైనా అందుబాటులో లేకుంటేనే ఇషాన్‌కు ఛాన్స్‌లు వస్తున్నాయి తప్పితే టీమిండియా తుది జట్టులో కిషన్‌కు పెద్ద అవకాశాలు రావడం లేదు. జట్టులో చోటు దక్కకపోవడంతో ఇషాన్‌కు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నాడని, అందుకే అతడు కొన్నాళ్లు ఆట నుంచి విరామం తీసుకునేందుకు దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది.