Shreyas Iyer an injury doubt for Rajkot Test: భారత్‌ జట్టు(Team India)ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్‌ రాహుల్‌(KL Rahuk), రవీంద్ర జడేజా (Ravendra Jadeja) జట్టుకు దూరంగా ఉండగా.. వ్యక్తిగత కారణలంటూ విరాట్‌ కోహ్లీ(Virat kohli) కూడా అందుబాటులో లేకుండా పోయాడు. తాజాగా భారత యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas Iyer)కు పాత గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను గాయం తిరిగిబెట్టింది. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న అయ్యర్‌.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో చేరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు దూరం కానున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయ్యర్‌ తిరిగి మళ్లీ ఐపీఎల్‌తో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన అయ్యర్‌ అంచనాలను అందుకో లేకపోయాడు.  నాలుగు ఇన్నింగ్స్‌లలో 26 సగటుతో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అయ్యర్‌ దూరమైతే అతని స్థానంలో దేశవాళీలో పరుగుల వరద పాలిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌(sarfaraz khan)కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. 


విరాట్‌ కష్టమే..?

గాయాలతో సతమతమవుతున్న టీమిండియా(Team India)కు పెద్ద షాక్‌ తగిలింది. మూడో టెస్ట్ నుంచి విరాట్‌ కోహ్లీ(Virat Kohli) జట్టులోకి వస్తాడనుకుంటున్న వేళ... విరాట్‌ అందుబాటులో ఉండడన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వ్యక్తిగత కారణాలతో ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మొదలయ్యే మూడో టెస్టుతో పాటు రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లు వార్తలు వస్తున్నాయి. భారత్, ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్టు ఈనెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి 27 వరకు రాంచీలో జరగనున్నాయి. ధర్మశాలలో మార్చి 7నుంచి మొదలయ్యే ఆఖరి టెస్టుకైనా కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్నది అనుమానంగా మారింది. జట్టుకు ఎప్పుడు అందుబాటులో ఉంటాననే విషయంపై కోహ్లి బీసీసీఐకి ఇంకా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. విరాట్‌ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

 

మాట మార్చిన డివిలియర్స్‌

విరుష్క జోడీ రెండో బిడ్డను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నారని ఇటీవల దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. కుటుంబం కోసం టెస్టులకు దూరమైనట్లు పేర్కొన్నాడు. తీరా, ఇప్పుడు ఏబీడీ ఇప్పుడు మాట మార్చాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో అయోమయం మొదలైంది. తాను గత వీడియోలో పెద్ద పొరపాటు చేశానని తనకు అందిన సమాచారమంతా తప్పేనని అంగీకరించాడు.  విరాట్‌ అనుష్క జోడి రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టాడు. దీనిపై విరాట్ కుటుంబమే స్పష్టత ఇస్తుందని కూడా చెప్పాడు. అక్కడ ఏం జరుగుతుందనేది తెలియదని... విరాట్‌ త్వరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని అన్నాడు. విరామం తీసుకోవడానికి కారణమేదైనా కోహ్లీ మరింత బలంగా తిరిగి రావాలని ఎదురు చూస్తున్నానని ఏబీడీ తెలిపాడు.