Liam Dawson Re Entry: ఇండియాతో మాంచెస్టర్ తో ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకు సంబంధించి ఇంగ్లాండ్ కీలక మార్పు చేసింది. గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో వెటరన్ లియామ్ డాసన్ ను జట్టులోకి తీసుకుంది. మూడో రోజు రిషభ్ పంత్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో బషీర్ గాయపడిన సంగతి తెలిసిందే. అతని ఎడమ చేతి చిటికెన వేలు విరగడంతో సర్జీరీ చేయనున్నారు. దీంతో మిగతా రెండు టెస్టులకు తనను జట్టు నుంచి తప్పించారు. ఆ స్థానంలో డాసన్ ని ఎంపిక చేశారు. నిజానికి బషీర్ స్థానంలో రెహాన్ అహ్మద్, జాక్ లీచ్, టామ్ హార్ట్ లీ పోటీ పడినా, కౌంటీల్లో చాలా అనుభవం ఉన్న డాసన్ కే ఇంగ్లాండ్ ఓటేసింది. తను చివరిసారిగా 2017లో సౌతాఫ్రికాపై టెస్టు ఆడాడు. అయితే ఇప్పటివరకు తను మూడు టెస్టులు ఆడగా, కేవలం ఏడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే దేశవాళీల్లో అతను నిలకడగా రాణిస్తుండటంతో, తిరిగి రీ ఎంట్రీ దక్కింది.
హేండీ బ్యాటర్..నిజానికి లెఫార్మ్ స్పిన్నరైన డాసన్.. వికెట్ కు వికెట్ అక్యూరెట్ గా బౌలింగ్ చేయగలడు. ఇక అతడికి బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉంది. 35 ఏళ్ల డాసన్ ఇప్పటివరకు 212 మ్యాచ్ లు ఆడగా, 371 వికెట్లు తీశాడు. సగటు 31.5 కావడం విశేషం. ఇక బ్యాటింగ్ లో 35కి పైగా సగటుతో 56 ఫిఫ్టీలు, 18 సెంచరీలు కూడా చేశాడు. నాలుగో టెస్టులో డాసన్ ఆడినట్లయితే ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
గాయంతోనే కీలక పాత్ర..మరోవైపు మూడో టెస్టు మూడో రోజు గాయపడినప్పటికీ, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో బషీర్ తన ఉనికిని చాటుకున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ లో రెండు పరుగులు చేసిన బషీర్.. బౌలింగ్ లో మాత్రం కీలక వికెట్ ను సాధించాడు. పదో వికెట్ అయిన మహ్మద్ సిరాజ్ ను ఔట్ చేయడంలో ఇంగ్లాండ్ పేసర్లు చేతులెత్తేస్తే, బషీర్ మాత్రం అతడిని ఔట్ చేసి, జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఎడమ చేతికి కట్టుతోనే తను బ్యాటింగ్, బౌలింగ్ చేయడం విశేషం. మరోవైపు దేశవాళీల్లో నిలకడగా రాణించడంతోనే డాసన్ ని జట్టులోకి తీసుకున్నట్లు ఇంగ్లాండ్ సెలెక్టర్ ల్యూక్ రైట్ స్పష్టం చేశాడు. హాంప్ షైర్ తరపున తను అద్భుతంగా రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇక గతనెలలో వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లోనూ డాసన్ అడాడు. ఈ సిరీస్ లో ఐదు వికెట్లు తీసి ఉమ్మడి అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. ఇలాంటి ప్రదర్శనే నాలుగో టెస్టులో కొనసాగించాలని తను భావిస్తున్నాడు.
నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ స్క్వాడ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హేరీ బ్రూక్, బ్రైడెన్ కార్స్, జాక్ క్రాలీ, లియామ్ డాసన్, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.