Rajeev Shukla Comments: దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యువ టీమిండియా.. తొలిసారిగా ఇంగ్లాండ్ పర్యటన చేస్తూ, ఆకట్టుకుంటుంది. ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మూడు మ్యాచ్ లు ముగిసేసరికి 1-2తో వెనుకంజలో నిలిచినా, ఇప్పటివరకు జరిగిన ఈ టెస్టుల్లో మన టీమే పైచేయి సాధించింది. మ్యాచ్ లో చాలా భాగం వరకు ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక మూడో టెస్టులో అనుభవం లేక పోవడం వల్ల టీమిండియాకు ఓటమి పాలైందని పేర్కొంటున్నారు చాలామంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ ఉంటే కథ వేరుగా ఉండేదని, ఈ మ్యాచ్ లో కచ్చితంగా విజయం సాధించేవారమని భారత అభిమానులు చర్చ జరుపుతున్నారు. తాజాగా దీనిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ పై ప్రకటన చేశారు.
సొంత నిర్ణయం..మూడో టెస్టులో ఈ దిగ్గజాలు ఉంటే బాగుండేదని, కచ్చితంగా గెలిచే వారమనే వ్యాఖ్యలతో శుక్లా ఏకీభవించారు. అయితే వారి రిటైర్మెంట్ నిర్ణయం వెనకాల బీసీసీఐ పాత్ర ఏమీ లేదని పునరుద్ఘాటించారు. రిటైర్మెంట్ అనేది సొంత నిర్ణయమని, దీనిపై బోర్డు కలగ జేసుకోలేదని పేర్కొన్నారు. ఏ ఆటగాడిని కూడా రిటైరవ్వాలని బోర్డు ఆదేశించ జాలబోదని తెలిపారు. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచాక రోకో ద్వయం.. పొట్టి ఫార్మాట్ కు టాటా చెప్పారు. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సడెన్ గా ముందు రోహిత్, ఆ తర్వాత కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికారు. అయితే వన్డేలకు మాత్రం అందుబాటులో ఉంటామని వెల్లడించారు. ఈ దిగ్గజాలు వన్డేలకు అందుబాటులో ఉండటం మంచి పరిణామమని శుక్లా పేర్కొన్నారు.
జవాబిచ్చిన గిల్..ఇక ఈ పర్యటనకి ముందు జట్టులో తన స్థానంపై ఎదురైన ప్రశ్నలకు గిల్ అద్బుతంగా సమాధామనిచ్చాడని శుక్లా పేర్కొన్నారు. ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలతో సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గా కూడా గిల్ ఆకట్టుకున్నాడని ప్రశంసించారు. ఇక ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన గిల్.. ఇంగ్లాండ్ లో ఒక సిరీస్ లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. మరోవైపు నాలుగో టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. నాలుగో టెస్టుకు ఇంకా వారం రోజులకుపైగా వ్యవధి ఉండటంతో బుమ్రాను ఆడిస్తే బాగుంటుందని, బుమ్రా లేకపోతే, జట్టు ఓడిపోయే ప్రమాదముందని తెలిపాడు. నాలుగో టెస్టులో భారత్ ఓడితే సిరీస్ ఫలితం తేలి పోతుందని, అందుకే బుమ్రాను ఆడించాలని సూచించాడు. నిజానికి ఈ సిరీస్ కంటే ముందే, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా కేవలం మూడు టెస్టులు మాత్రమే జస్ ప్రీత్ బుమ్రా ఆడతాడని హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 23 నుంచి మాంచెస్టర్ లో నాలుటో టెస్టు ప్రారంభం కానుంది.