Gary Kirsten Vs Shaheen Shah Afridi: పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ షహీన్‌ షా అఫ్రిదీ(Shaheen Shah Afridi)పై చిక్కుల్లో పడ్డాడు. అమెరికా- వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇచ్చిన టీ 20 ప్రపంచకప్‌(T20 WC)లో కోచ్‌, సహాయ సిబ్బంది, మేనేజ్‌మెంట్‌తో షహీన్‌ షా అనుచితంగా ప్రవర్తించారనే సంచలన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రధాన్‌ కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌తో పాటు, మరో కోచ్‌ అజార్‌ మహమూద్‌తో షహీన్‌ షా అఫ్రిదీ అనుచితంగా ప్రవర్తించాడని... దీనిపై కిర్‌స్టెన్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు నివేదిక కూడా సమర్పించాడన్న వార్తలు వస్తున్నాయి. గతంలోనూ షహీన్‌ షా అఫ్రిదీ ఇలాగే ప్రవర్తించాడని.. కానీ తన లాబీయింగ్‌ వల్ల అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న వార్త పాకిస్థాన్‌ క్రికెట్‌లో సంచలనం రేపుతోంది.

 

ఇంతకీ షహీన్‌ షా ఏమన్నాడు

పాకిస్థాన్‌ ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, అసిస్టెంట్‌ కోచ్‌ అజార్ మహమూద్‌లతోపాటు సహాయ సిబ్బందిపై సీమర్ షహీన్‌ షా అప్రిదీ తప్పుగా ప్రవర్తించాడని.. పాకిస్తాన్‌కు చెందిన వార్తా సంస్థ సమా న్యూస్ వెల్లడించింది. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు పాకిస్థాన్‌ ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో షహీన్ షా అఫ్రిదీ ఘోరంగా విఫలం అయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌లోనూ ఈ పాక్‌ స్టార్‌ పెద్దగా రాణించలేదు. ఈ రెండు సిరీస్‌లకు షహీన్‌ షా అఫ్రిదీ పాక్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌ సమయంలోనే అప్పుడే కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌, అజార్‌ మహమూద్‌లతో అనుచితంగా ప్రవర్తించడానే వార్తలు వచ్చాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో మ్యాచుల తర్వాత షహీన్ ప్రవర్తన సరిగా లేదని కోచ్‌లు గుర్తించారు. అదే విషయాన్ని పాక్‌ క్రికెట్‌ బోర్డుకు నివేదించారు. షహీన్‌ షా అఫ్రిదీ వ్యవహార శైలిపై కిర్‌స్టెన్‌... పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. అయితే లాబీయింగ్‌ వల్ల పీసీబీ.. షహీన్‌ షా అఫ్రిదీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో షహీన్‌ షా అఫ్రిదీ మరింత రెచ్చిపోయాడు. షహీన్‌ షా అఫ్రిదీ అనుచిత వ్యవహర శైలితో పాక్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ప్రభావమైందని.. అది ఆటతీరుపై స్పష్టంగా కనిపించిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

 

చర్యలు ఎందుకు తీసుకోలేదు..?

కిర్‌స్టెన్ ఫిర్యాదు చేసినప్పుడు షహీన్‌ షా అఫ్రీదిపై ఎందుకు చర్య తీసుకోలేదనే దానిపై దర్యాప్తు చేయాలని పాక్‌ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో పాకిస్తాన్ జాతీయ సెలక్షన్ కమిటీ నుంచి ఇటీవలే తొలగించిన మాజీ క్రికెటర్ వాహబ్ రియాజ్ వ్యాఖ్యలు మరింత సంచలన సృష్టించాయి. తాను బయటకు చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయని... కానీ తాను ఎవరిపైనా నిందలు వేయాలనుకోవడం లేదని వహాబ్‌ రియాజ్‌ అన్నాడు. ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టన్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బంది పాక్‌ జట్టు అభ్యున్నతి కోసం ఎంతో శ్రమించారని.. కానీ వారికి సరైన గౌరవం దక్కలేదని అన్నాడు. అయితే ఈ అంశంపై పీసీబీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.