Shah Rukh Khan: కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలనం రింకూ సింగ్‌కు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బంపరాఫర్ ఇచ్చాడు. ప్రముఖుల ఇండ్లల్లో ఫంక్షన్లకు విచ్చేసి అతిథుల్ని అలరించే షారుఖ్.. రింకూ పెళ్లికి కూడా వచ్చేసి డాన్స్ చేసి వెళ్తానని చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా రింకూనే వెల్లడించాడు. ఇటీవలే కేకేఆర్-ఆర్సీబీ మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ రింకూ ఈ విషయం చెప్పాడు.
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన మ్యాచ్ (ఏప్రిల్ 9న)లో ఆఖరి ఓవర్‌కు 29 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకూ సింగ్ యశ్ ధయాల్ బౌలింగ్ లో వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత రింకూకు షారుఖ్ ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించాడు. ఇదే విషయాన్ని రింకూ వివరిస్తూ.. ‘‘ఆ మ్యాచ్ తర్వాత సార్ (షారుఖ్) నాకు కాల్ చేశాడు. నా పెళ్లి గురించి మాట్లాడాడు. ‘సాధారణంగా చాలామంది నన్ను మా ఇంట్లో పెళ్లికి రమ్మని పిలుస్తుంటారు. నేను మాత్రం వెళ్లను. కానీ నీ పెళ్లికి కచ్చితంగా వచ్చి డాన్స్ చేస్తా..’అని నాతో అన్నాడు’’ అంటూ రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.
కాగా గుజరాత్‌తో మ్యాచ్ లో రింకూ సింగ్ ఐదు సిక్సర్ల తర్వాత షారుఖ్ కూడా తన ట్విటర్ ఖాతాలో పటాన్ సినిమా పోస్టర్ లో అతడి ముఖాన్ని తీసేసి ఆ ప్లేస్ లో రింకూను అతికించి షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో రింకూ కేకేఆర్ కు కీలక ఆటగాడిగా మారాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన రింకూ.. 8 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 62.75 సగటుతో 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.
రింకూ రాణిస్తున్నా కేకేఆర్ మాత్రం దారుణ ఓటములతో ప్లేఆఫ్స్ కు చేరడం కష్టంగానే ఉంది. ఇప్పిటిదాకా 8 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్.. మూడు మాత్రమే గెలిచింది. అందులో రెండు బెంగళూరు మీదే. మరోకటి గుజరాత్ పై. అవి తప్ప మిగిలిన ఐదు మ్యాచ్ లు ఓడి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఆ జట్టు ఈనెల 29న ఈడెన్ గార్డెన్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. ఇకనుంచి ఆడే మ్యాచ్‌లు అన్నీ కేకేఆర్ కు చాలా కీలకం.