India wins Womens World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో అరుదైన రికార్డును టీమిండియా ఓపెనర్ షఫాలీ వర్మ చేజార్చుకుంది. నవంబర్ 2న నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఇండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ ఫైనల్‌లో సెంచరీ చేయడంలో విఫలమైంది. అయితే షఫాలీ 87 పరుగులు చేసి మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్‌లో సెంచరీ చేసింటే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్ రికార్డు ఆమె ఖాతాలో చేరేది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
2017 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఓపెనర్ పూనం రౌత్ చేసిన 86 పరుగులే ఇప్పటివరకూ అత్యధికం. తాజాగా షఫాలీ వర్మ 87 పరుగులతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచింది. ఈ మ్యాచులో షఫాలీ వర్మ బంతితోనూ అద్భుతం చేసింది. కీలక సమయంలో బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టింది. వరల్డ్ కప్ ఫైనల్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఉమెన్ బ్యాటర్‌గా షఫాలీ వర్మ రికార్డులు క్రియేట్ చేసింది.
ఫైనల్‌లో సెంచరీ మిస్ అయిన షెఫాలీ
భారత విధ్వంసకర ఓపెనర్ షెఫాలీ వర్మ దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 78 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసింది. షెఫాలీ దూకుడుగా ఆడుతూ ఇండియాకు మంచి ఆరంభం ఇచ్చింది. మరో ఓపెనర్ స్మృతి మంధానాతో కలిసి మొదటి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. షెఫాలీ తన దూకుడైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలో షఫాలీ.. అయాబోంగా ఖాకా బౌలింగ్‌లో సునే లూస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైంది.
ఫైనల్‌లో హాఫ్ సెంచరీ మిస్ అయిన స్మృతి
మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అర్ధ సెంచరీని సాధించడంలో విఫలమైంది. ఆమె తన బ్యాటింగ్‌తో ఇండియాకు మంచి ఆరంభం ఇచ్చింది. 58 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేసింది. ఫైనల్ కావడంతో మంధాన ఆచితూచి ఆడింది. స్మృతి 17వ ఓవర్లో క్లో ట్రయాన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సినోలో జాఫ్తాకు క్యాచ్ ఇచ్చింది.
సౌతాఫ్రికాతో జరిగిన మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ ఫిఫ్టీ (78 బంతుల్లో 87, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. సఫారీ బౌలర్లలో ఖాఖాకు 3 వికెట్లు దక్కాయి. మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఒక జట్టు ఛేజ్ చేసిన అత్యధిక స్కోరు 167 పరుగులే. తాజాగా జరిగిన ఫైనల్లో 299 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.