Sachin Tendulkar: 


టీమ్‌ఇండియా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. సిడ్నీ క్రికెట్‌ మైదానంలో ఒక గేటుకు అతడి పేరు పెట్టారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ 50వ పుట్టిన రోజున క్రికెట్‌ ఆస్ట్రేలియా, న్యూసౌత్‌ వేల్స్‌ ఇలా గౌరవించాయి. మరో గేటుకు వెస్టిండీస్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారా పేరు పెట్టాయి. దాంతో వీరిద్దరూ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌, అలన్‌ డేవిడ్‌సన్‌, ఆర్థర్‌ మోరిస్‌ సరసన నిలవనున్నారు.




సిడ్నీ క్రికెట్‌ స్టేడియం గేట్లకు ఏప్రిల్‌ 24నే సచిన్‌, లారా పేర్లు పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఇది సచిన్‌ పుట్టినరోజు. 1993 జనవరిలో లారా అరంగేట్రం చేసింది ఇక్కడే. అప్పుడు 277 పరుగులతో చరిత్ర సృష్టించాడు. దీనికి 30 ఏళ్లు నిండటం మరో కారణం. బ్రాడ్‌మన్‌ మెసేంజర్‌ స్టాండ్‌, మెంబర్స్‌ పెవిలియన్‌ మధ్యలో ఈ గేట్లు ఉన్నాయని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. సాధారణంగా విజిటింగ్‌ క్రికెటర్లు ఇక్కడ నుంచే మైదానంలోని ప్రవేశస్తారని వెల్లడించింది.


'భారత్‌ తర్వాత విదేశాల్లో నాకు ఇష్టమైన క్రికెట్‌ మైదానం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌. ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. 1991-92లో తొలిసారి నేనిక్కడ పర్యటించాను. సిడ్నీ క్రికెట్‌ మైదానానికి విజిటింగ్‌ క్రికెటర్లు వేళ్లే గేటుకు నా ఫ్రెండ్‌ లారా, నా పేర్లు పెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను' అని సచిన్‌ తెందూల్కర్‌ అన్నాడు.




'సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ మేనేజ్‌మెంట్‌ నన్ను గుర్తించినందుకు గౌరవంగా ఉంది. సచిన్‌ కూడా ఇలాగే భావిస్తాడు. ఈ మైదానంలో నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో స్పెషల్‌ మెమరీస్‌ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఎప్పుడు పర్యటించినా సిడ్నీ స్టేడియంలో ఆటను ఆస్వాదిస్తాను' అని బ్రియన్‌ లారా వెల్లడించాడు. లారా చేసిన 277 పరుగులే సిడ్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు. నాలుగు టెస్టుల్లో అతడు 384 పరుగులు చేశాడు. ఇక సచిన్‌కు ఇక్కడ 157 యావరేజ్‌ ఉంది. ఐదు టెస్టుల్లో 785 పరుగులు, 3 సెంచరీలు కొట్టాడు. 2004 జనవరిలో 241 నాటౌట్‌గా నిలిచాడు.


ప్రస్తుతం సచిన్‌ తెందూల్కర్‌ ముంబయి ఇండియన్స్‌కు మెంటార్‌గా సేవలందిస్తున్నాడు. మిగతా సమయంలో కుటుంబంతో ఉంటున్నాడు. కెరీర్‌ ఆరంభం నుంచీ అతడి అనుబంధం ముంబయి ఇండియన్స్‌తోనే ముడిపడింది. ఇప్పుడు ఆయన కుమారుడు అర్జున్‌ సైతం అరంగేట్రం చేశాడు. చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. టెస్టు, వన్డే, టీ20ల్లో కలిపి సచిన్‌ 34,357 పరుగులు చేశాడు. 100 సెంచరీలు కొట్టాడు. 164 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధికంగా ఆస్ట్రేలియాపై 110 మ్యాచుల్లో 49.68 సగటుతో 6707 రన్స్‌ చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 67 మ్యాచుల్లో 42.85 సగటుతో 3300 రన్స్‌ అందుకున్నాడు.