Sanju Samson and Sachin Tendulkar: టీ20 ప్రపంచకప్‌లో భారత్ చారిత్రక విజయం సాధించిన తర్వాత దేశమంతా ఒకే పేరు మారుమోగుతోంది. అదే సంజూ శాంసన్. టోర్నీ ఆద్యంతం అద్బుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఈ కేరళ స్టార్, తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. కేవలం బ్యాటింగ్ టెక్నిక్ మాత్రమే కాకుండా, మానసిక దృఢత్వం తనను ఎలా విశ్వవిజేతగా నిలబెట్టిందో వివరించాడు. క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడిన ఫోన్ కాల్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నాడు.
పాతాళం నుంచి శిఖరానికి
కొన్ని రోజుల క్రితం వరకు సంజూ శాంసన్ ఓ ఫెయిల్యూర్ క్రికెటర్. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సమయంలో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఇదే విషయాన్ని సంజూ ఫైనల్ మ్యాచ్ తర్వాత చెప్పాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆయనకు అండగా నిలిచాడు. సచిన్‌తో జరిగిన సుదీర్ఘ చర్చలు సంజూ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేశాయి.
కెరీర్‌ను మలుపు తిప్పిన 25 నిమిషాల ఫోన్ కాల్
సచిన్ టెండూల్కర్‌తో సంజూకు గతంలోనూ పరిచయం ఉన్నప్పటికీ, ఈసారి జరిగిన చర్చలు చాలా ప్రత్యేకం. తన కెరీర్‌లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను, వైఫల్యాలను అధిగమించిన తీరు సచిన్ సంజూతో పంచుకున్నారు. సుమారు 25 నిమిషాల పాటు సాగిన ఆ ఫోన్ కాల్, సంజూలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. కేవలం మానసిక స్థయిర్యాన్నే కాకుండా మైదానంలో ప్రశాంతంగా ఎలా ఉండాలో సచిన్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను అందించారు. ఫైనల్‌మ్యాచ్‌కు ఒక రోజు ముందు కూడా సచిన్ సంజూకు ఫోన్ చేసి అన్నీ సిద్ధమేనా అని ఆత్మీయంగా పలకరించడం ఆయనకు కొండత బలాన్ని ఇచ్చింది.
ఆట తీరులో మార్పు
సచిన్ మార్గదర్శకత్వంలో సంజూ తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. గతంలో ప్రతి బంతిని బాదాలనే తపనతో వికెట్ పారేసుకునే సంజూ, ఇప్పుడు అత్యంత ప్రశాంతంగా, లెక్కలతో కూడిన బ్యాటింగ్‌ను ప్రదర్శించారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్‌ఒక మాస్టర్ క్లాస్‌గా నిలిచింది. క్రీజులో వచ్చిన క్షణం నుంచి ఆటపై పూర్తి నియంత్రణ సాధించి, భారత్ మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
డిజిటల్ డిటాక్స్- ఫోన్ స్విచ్ఛాఫ్
ఆధునిక కాలంలో క్రీడాకారులపై సోషల్ మీడియా ప్రభావం పెను సవాలుగా మారింది. విమర్శలు, ప్రశంసల మధ్య ఏకాగ్రత కోల్పోకుండా ఉండేందుకు సంజూ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్ జరిగిన నెల రోజుల పాటు తన మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉన్నాడు. బయటి ప్రపంచంలో జరిగే గోల మన ఏకాగ్రతను దెబ్బ తీస్తుంది. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉండి, కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టాను అని సంజూ తెలిపారు. ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఒక ప్రత్యేక బృందం పర్యవేక్షించగా సంజూ మాత్రం పూర్తి స్థాయిలో ఆటకే అంకితమయ్యారు.
ఈ విజయం కేవలం సంజూ శామసన్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఓర్పు, క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఎంతటి వైఫల్యాన్నైనా అధిగమించవచ్చని నిరూపించిన స్ఫూర్తిదాయక కథనం.
