ISPL Opening Ceremony: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ప్రారంభ వేడుక థానేలోని ద‌డొజీ కొన‌దేవ్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్షయ్ కుమార్, సూర్య, బోమన్ ఇరానీ, సచిన్ టెండూల్కర్ తదితరులు పాల్గొన్నారు.  అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా అతిధులుగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట‌కు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, మెగా ప‌ప‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, బాలీవుడ్ నటుడు అక్ష‌య్ కుమార్‌, త‌మిళ న‌టుడు సూర్య, ర‌విశాస్త్రి కాలు క‌దిపారు. వారు అలా స్టెప్పులు వేస్తుంటే అభిమానులు కేరింత‌లు కొట్టారు. 

 

టెన్నిస్‌ బాల్‌తో ఆడుతున్న ఈ టోర్నీ లో సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యంలోని టీమ్‌ మాస్టర్స్‌ ఎలెవన్‌ జట్టు.. హిందీ నటుడు అక్షయ్‌ కుమార్‌ సారథ్యంలోని టీమ్‌ ఖిలాడీతో పోటీ పడగా ఈ మ్యాచ్‌లో సచిన్‌.. 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్‌ ఆడబోయిన సచిన్‌.. మరో భారత మాజీ క్రికెటర్‌ నమన్‌ ఓజా చేతికి చిక్కాడు. స్టాండప్‌ కమెడియన్‌గానే గాక గతేడాది హిందీ బిగ్‌ బాస్‌ విన్నర్‌ అయిన మునావర్‌ ఫారుఖీ బౌలింగ్‌లో సచిన్‌ నిష్క్రమించాడు. ఈ మ్యాచ్‌లో సచిన్‌ జమ్మూకాశ్మీర్‌ పారా క్రికెట్‌ టీమ్‌కు సారథిగా ఉన్న అమిర్‌ హుస్సేన్‌తో కలిసి బ్యాటింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో సచిన్‌ అమిర్‌ పేరుతోనే ఉన్న జెర్సీని ధరించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. 

 



ఈ లీగ్‌ ఎలా జరుగుతుందంటే..?

ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రిమియర్‌ లీగ్‌  టీ10 ఫార్మాట్లో జరిగే టెన్నిస్ క్రికెట్ లీగ్. మన దేశంలోని ప్రతిభావంతమైన స్థానిక క్రికెటర్లను వెలుగులోకి తేవడానికి ఇది దోహదపడుతుంది. ఈ లీగ్ ద్వారా యంగ్ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసి.. భావి క్రికెట్ సూపర్ స్టార్లుగా తీర్చిదిద్దనున్నారు. అదే సమయంలో నగరాల్లో ఆటకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపరుస్తారు. 2024 మార్చి 2 నుంచి 9వ తేదీ వరకు ఐఎస్‌పీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. గల్లీ క్రికెట్‌కు, స్టేడియంలో జరిగే ప్రొఫెషనల్ గేమ్‌కు మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చడానికి ఐఎస్‌పీఎల్ కట్టుబడి ఉంది. గల్లీ క్రికెట్లో సత్తా చాటే యంగ్ అండ్ టాలెంటెడ్ ఆటగాళ్లు తదుపరి దశకు చేరుకోవడానికి ఈ లీగ్ ఉపయోగపడుతుంది. ఇండియన్‌ స్ర్టీట్‌ ప్రీమియర్‌ లీగ్‌లో హైదరాబాద్ జట్టుకు రామ్ చరణ్ యజమాని కాగా.. ముంబై జట్టుకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, శ్రీనగర్ జట్టుకు అక్షయ్ కుమార్, బెంగళూరు జట్టుకు హృతిక్ రోషన్,చెన్నై సింగమ్ జట్టుకు సూర్య, టైగర్ ఆఫ్ కోల్‌కతా జట్టుకు సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ యజమానులుగా ఉన్నారు.

రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగే ఈ పోటీలో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడుతారు. ఈ పోటీల పట్టికలో టాప్ 4 స్థానాల్లో నిలిచిన జట్లను సెమిఫైనల్స్ ఆడిస్తారు. అనంతరం వారిలో గెలిచిన వారికి ఫైనల్ మ్యాచ్ నిర్వహించి జట్టు విజేతగా ప్రకటిస్తారు.



ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొత్తం 15 మ్యాచ్‌లు థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగుతాయి. గ్రాండ్ ఫినాలే‌ మార్చ్ 15వ తేదీన జరుగుతుంది. ఈ పోటీలలు  సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్‌లో ప్రసారం  కానున్నాయి.