ఆసియా కప్‌లో భారత మాజీ ఆటగాళ్లు తమ తుది జట్లను ఎంచుకుంటున్నారు. అయితే తుది జట్టులో వికెట్ కీపర్ గా రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ లలో ఎవరు ఉంటారు అనేది ఆసక్తిగా మారింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి భారత జట్టుతో చేరడంతో టాప్ ఆర్డర్ లో ఉన్నారు. సూర్య కుమార్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు మిడిల్ ఆర్డర్ లో ఉండటంతో ఇంకా ఒక్క స్థానం మాత్రమే ఖాళీగా ఉంది. మరి అందులో జట్టు యాజమాన్యం ఎవరిని ఉంచుతుందో చూడాలి.
వికెట్ కీపర్ గా పంత్‌కు చోటు !
భారత మాజీ ఆటగాడు సబాం కరీం కూడా తన తుది జట్టును ప్రకటించాడు. అందులో వికెట్ కీపర్ గా పంత్ కు స్థానం కల్పించాడు. పంత్ భారత జట్టుకు ఎక్స్ ఫాక్టర్ అవుతాడని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తను ఫాంలో లేకపోయినప్పటికీ.. పరుగులు చేయడానికి అవసరమైన ఫైర్ పంత్ లో ఉందని కరీం అన్నారు. ఉత్కంఠ పరిస్థితుల్లో సైతం యువ సంచలనం పంత్ బ్యాట్ ఝుళిపించగలడని.. ఇలాంటివి అతను చాలా ఎదుర్కొన్నాడని చెప్పారు. ఆసియా కప్ లో రిషభ్ బాగా ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ 18 నిర్వహించిన షో స్పోర్ట్స్ ఓవర్ ది టాప్ లో కరీం ప్రత్యేకంగా మాట్లాడారు. రిషభ్ పంత్ తోనే తాను ముందుకు వెళతానని.. ఆసియా కప్ 2022లో అతను అద్భుత ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నారు. అలాగే 5 వికెట్లు తీయగల బౌలింగ్ దళాన్ని తన టీంలో చేర్చానని అన్నాడు. ఆరో బౌలర్ గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఉన్నాడు కనుక ఒక వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్‌కే తుది జట్టులో చోటుందని.. అతడు పంత్ మాత్రమేనని కరీం చెప్పారు.
టీమిండియా టాప్ 3 ఆటగాళ్లు వీరే..
తన జట్టులో టాప్ 3 బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఉంటారని కరీం అన్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఒక మల్టీ డైమెన్షనల్ ఆటగాడని.. అతను ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలడని చెప్పారు. పంత్, పాండ్య, జడేజాలను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లుగా ఎంపికచేశాడు. అయితే అశ్విన్ కు తన తుది టీంలో చోటివ్వలేదు. ప్రత్యర్థి జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ ఎక్కువ ఉంటేనే అశ్విన్ ను ఆడించాలని కరీం అభిప్రాయపడ్డారు. ఇక ముఖ్య స్పిన్నర్‌గా యుజువేంద్ర చాహల్, పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, అర్హదీప్ సింగ్, అవేష్ ఖాన్లను ఎంపికచేశాడు.
సబాం కరీం జట్టు
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, అర్హదీప్ సింగ్, అవేష్ ఖాన్.