Rohit Sharma, Virat Kohli, Shikhar Dhawan ODI Records:
టీమ్‌ఇండియా బెస్ట్ టాప్ ఆర్డర్ అంటే మీకు గుర్తొచ్చేది ఎవరు? ఒకప్పుడైతే సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ అనే చెప్తారు. అప్పటి నిబంధనలను అనుసరించి పరుగుల వరద పారించిన మొనగాళ్లు వీరు.
2015-2020 అంటే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ పేర్లు కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. కొన్నేళ్ల పాటు వీరు సృష్టించిన విధ్వంసాలు అన్నీ ఇన్నీ కావు! ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. మరికొన్ని సృష్టించారు.
మైదానంలో పరుగులు సునామీ సృష్టించిన ఈ త్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ టాప్ ఆర్డర్ అంటే అతిశయోక్తి కాదు! 2015 నుంచి ఈ ముగ్గురూ ఎంతో మంది బౌలర్లకు చుక్కలు చూపించారు. సెంచరీల మోత మోగించారు. సిక్సర్ల వరద పారించారు. 2015-19 మధ్యన వన్డేల్లో ఈ ముగ్గురూ కలిసి ఏకంగా 14015 పరుగులు సాధించారు. 60.4 సగటుతో బ్యాటింగ్ చేశారు. సంయుక్తంగా 56 శతకాలు, 58 అర్ధశతకాలు బాదేశారు.
అలాంటిది 2020 నుంచి ఈ ముగ్గురి ప్రభ తగ్గుతూ వస్తోంది. కలిసి ఆడటమే గగనంగా మారింది. గబ్బర్ దాదాపుగా టీమ్‌ఇండియా ప్రణాళికల్లో లేడు. ప్రపంచకప్ తర్వాత రోహిత్, కోహ్లీ భవిష్యత్తేంటో తెలియదు. ఈ ముగ్గురూ కలిసి 2020 తర్వాత 40.31 సగటుతో 2580 పరుగులు చేశారు. 2 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు బాదారు.
బహుళ జట్లు తలపడే టోర్నీల్లో గబ్బర్ తనకు తిరుగులేదని చాటుకున్నాడు. వన్డే క్రికెట్లో దూకుడైన ఓపెనర్‌గా ఎదిగాడు. మొత్తంగా 167 వన్డేల్లో 44.14 సగటుతో 6793 పరుగులు సాధించాడు. 2015 నుంచి 2019 వరకు ఏటా 745, 287, 960, 897, 583 చేశాడు. ఆ తర్వాత రెండేళ్లు 290, 297కు పరిమితం అయ్యాడు. గతేడాది 22 వన్డేల్లో 688 సాధించాడు. ఇందులో చాలా మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. టీ20 ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో వీటికి ఎక్కువ విలువేం లేదు. రెండేళ్లలో విరాట్, రోహిత్ సాధించిన పరుగులూ తక్కువే! ఇకపై ఈ ముగ్గురు కలిసి ఆడటం అరుదే!