వన్డే ప్రపంచ కప్ 2023లో ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక నుంచి అంతర్జాతీయంగా టీ20 మ్యాచ్ లు ఆడకూడదని హిట్ మ్యాన్ భావిస్తున్నాడని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఇదే నిజమైతే టీ20లలో రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ లు, శతకాలు చూడలేమని ఫ్యాన్స్ కూడా నిరాశ చెందుతున్నారు. వాస్తవానికి రోహిత్ శర్మ ఏడాది కాలం నుంచి అంతర్జాతీయంగా పొట్టి ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నవంబర్ 2022లో టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత హిట్ మ్యాన్ రోహిత్ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడని తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ మీద ఫోకస్ చేసిన కారణంగా రోహిత్ టీ20లకు దూరంగా ఉన్నాడని అంతా భావించారు. అయితే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తరువాత రోహిత్ వైట్ బాల్ క్రికెట్ ప్లాన్ పై బీసీసీఐ అతడితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ ఇక అంతర్జాతీయంగా టీ20 ఫార్మాట్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించడనే వార్త వైరల్ అవుతోంది. గత ఏడాది నుంచి టీ20లలో హార్దిక్ పాండ్యా జట్టుకు సారథిగా వ్యవహరించాడు. 



 వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే వ్యవహరించాలనే అభిప్రాయాలు ఎక్కువ మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి బీసీసీఐ సెక్రటరీ జై షా తొలిసారి స్పందించారు. మళ్లీ రోహిత్ టీ20 ఫార్మాట్లోకి పునరాగమనంపై జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ఫార్మాట్ లో రోహిత్ శర్మ పునరాగమనంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేనని జైషా చెప్పారు. టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ  కెప్టెన్సీ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. టీ20 ప్రపంచకప్ జూన్‌లో జరగనుందని.... అంతకన్నా ముందు తమకు ఐపీఎల్, అఫ్ఘానిస్థాన్‌తో సిరీస్ ఉందని బీసీసీఐ కార్యదర్శి గుర్తు చేశాడు. బెంగళూరులో కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ వచ్చే ఏడాది ఆగష్టులో ప్రారంభం అవుతుందని జై షా వెల్లడించాడు.



 జై షా వ్యాఖ్యలు పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్‌కు సారథ్యం అప్పగించే అవకాశాలు లేవన్నట్లుగా ఉండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 36 ఏళ్ల భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ తరఫున 148 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్లో 4 సెంచరీలు బాదిన హిట్ మ్యాన్ 140 స్ట్రైక్ రేట్‌తో 3,853 పరుగులు సాధించాడు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తరువాత అజిత్ అగార్కర్ తో చర్చలు జరిపిన రోహిత్ పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉంటూనే వన్డే ప్రపంచ కప్ పై ఫోకస్ చేశాడు. ఇక వన్డే వరల్డ్ కప్ ముగియడంతో రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా, లేక ఏదైనా ఫార్మాట్ నుంచి వైదొలుగుతాడా అతడి మనసులో ఏముందంటూ క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. టీ20లకు దూరంగా ఉండాలన్నది పూర్తిగా రోహిత్ వ్యక్తిగత అభిప్రాయమని బీసీసీఐ అధికారి ఒకరు  అన్నారు.