Rohit Captaincy: వ‌చ్చే జూన్ లో జ‌రిగే ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో టెస్టు జ‌ట్టుకు కెప్టెన్ గా ఎవ‌రుండాలో డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం. బీసీసీఐ అధికారుల స‌మాచారం ప్ర‌కారం ఇంగ్లాండ్ తో టూర్ కు రోహిత్ నే కెప్టెన్ గా కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు వ‌రుస‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న రోహిత్.. ఇంగ్లాండ్ తో వ‌న్డే సిరీస్ నుంచి ల‌య దొర‌క‌బుచ్చుకున్నాడు. ఆ సిరీస్ లో సెంచ‌రీ బాదిన హిట్ మ్యాన్ .. త‌ర్వాత మెగాటోర్నీలో త‌న స‌త్తా చూపించాడు. కీల‌క మైన ఆరంభాల‌ను ఇస్తూ, జ‌ట్టును మంచి పొజిష‌న్ లో ఉంచాడు. ఇక ఫైన‌ల్లో 76 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడి, 12 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మెగాటోర్నీని భార‌త్ కైవ‌సం చేసుకునేలా కీల‌కపాత్ర పోషించాడు. అలాగే ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఈక్ర‌మంలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడేందుకు రోహిత్ సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. చివ‌ర‌గా మెల్ బోర్న్ లో జ‌రిగిన మ్యాచ్ లో త‌ను బ‌రిలోకి దిగాడు. ఫామ్ కోల్పోవ‌డంతో కెప్టెన్ అయ్యుండి కూడా అవ‌మాన‌క‌రంగా త‌ను రిజ‌ర్వ్ లోకి వెళ్లాడు. అయితే ఇప్పుడు వ‌చ్చిన కొత్త ఉత్సాహంతో టెస్టు జ‌ట్టును లీడ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. 


ముందే ఊహించా..
ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీని భార‌త్ గెలుస్తుంద‌ని త‌ను ముందే ఊహించిన‌ట్లు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. జ‌ట్టు చాలా స‌మ‌తూకంతో ఉంద‌ని, ఈ జ‌ట్టును ఓడించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని భావించిన‌ట్లు తెలిపాడు. ముఖ్యంగా యువ‌, అనుభ‌వ‌జ్ఞుల క‌ల‌యిక‌తో అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంసించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపించారని ప్రశంసించాడు.  పాంటింగ్ ఊహించిన‌ట్లుగానే అజేయంగా నిలిచి, మెగాటోర్నీని భార‌త్ కైవ‌సం చేసుకుంది. వ‌రుస‌గా ఐదు మ్యాచ్ లు గెలిచి మెగాటోర్నీలో త‌న ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. జ‌ట్టులో ముగ్గురు ఆల్ రౌండ‌ర్లు ఉండ‌టం చాలా ప్ల‌స్ పాయింట్ గా మారింద‌ని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. 


ఆ బెనిఫిట్ పొందారు..
జ‌ట్టులో ముగ్గురు సిస‌లైన ఆల్ రౌండ‌ర్లు ఉండ‌టంతో మెగాటోర్నీలో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చింద‌ని పాంటింగ్ పేర్కొన్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో  జ‌ట్టు మ‌రింత ప‌టిష్టంగా మారింద‌ని చెప్పుకొచ్చాడు. ఆరు బౌలింగ్ ఆప్ష‌న్లు, ఎనిమిదో నెంబ‌ర్ వ‌ర‌కు స్పెష‌లిస్టు బ్యాట‌ర్ ఇలా భార‌త జ‌ట్టు మంచి ఫలితాను పొందింద‌ని, ముఖ్యంగా జడేజా, అక్ష‌ర్ రూపంలో లోయ‌ర్ ఆర్డ‌ర్ లో ఎడ‌మ చేతి వాటం బ్యాట‌ర్లు అందుబాటులో ఉండ‌టం చాలా క‌లిసొచ్చింద‌ని పేర్కొన్నాడు. అయితే పేస్ విభాగం అంత ప‌టిష్టంగా లేద‌ని, దుబాయ్ లో ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లుగా జ‌ట్టు కూర్పు ఉంద‌ని తెలిపాడు. నాకౌట్ మ్యాచ్ ల్లో ఒక్క స్పెష‌లిస్టు పేస‌ర్ తోనే బ‌రిలోకి దిగినా, రెండో పేస‌ర్ గా హార్దిక్ పాండ్యా న్యాయం చేశాడ‌ని చెప్పొకొచ్చాడు. తాజా విజ‌యంతో మెగాటోర్నీని భార‌త్ మూడుసార్లు కైవ‌సం చేసుకున్న‌ట్లు అయింది. 2002, 2013, 2025ల‌లో మెగాటోర్నీని ద‌క్కించుకుని, టోర్నీలో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా రికార్డుల‌కెక్కింది.