Rohit Sharma smashes multiple records in T20 WC semis vs ENG: పొట్టి ప్రపంచకప్‌(T20 World Cup))ను ఒడిసిపట్టేందుకు టీమిండియా(Team India) కేవలం ఒకే అడుగు దూరంలో ఉంది.   ఈ మెగా టోర్నీలో ఒక్క పరాజయం లేకుండా భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే టీమిండియాను ఫైనల్‌కు చేర్చడంలో రోహిత్‌ శర్మ(Rohit Sharma) కీలక పాత్ర పోషించాడు. సూపర్‌ ఎయిట్‌లో ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన హిట్‌మ్యాన్‌.. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌ అర్ధ సెంచరీతో మెరిసి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 57 పరుగులు చేసి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌కు 171 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ధోనీ, కోహ్లీ, అజారుద్దీన్, సౌరవ్ గంగూలీల రికార్డులను సమం చేయడమే కాకుండా భారత కెప్టెన్‌గా మరో కొత్త రికార్డును సృష్టించాడు.

 

కెప్టెన్‌గా 5,000 పరుగులు పూర్తి

రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌... సారధిగా 5,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన అయిదో భారత కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌గా 122 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్‌ ఇప్పటివరకూ 5,013 పరుగులు చేశాడు. రోహిత్‌ కంటే ముందు, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కెప్టెన్‌గా 5,000, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించారు. భారత కెప్టెన్‌గా 195 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ 7,643 పరుగులు చేశాడు. మహ్మద్‌ అజారుద్దీన్ సారధిగా 221 మ్యాచ్‌ల్లో 8,095 పరుగులు చేశాడు. టీం ఇండియాకు అత్యధిక మ్యాచుల్లో సారథ్యం వహించిన ధోనీ.. 332 మ్యాచ్‌ల్లో 11,207 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 213 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లి 12,883 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 

 

కెప్టెన్‌గా అత్యధిక పరుగులు

విరాట్ కోహ్లీ: 12,883 పరుగులు (213 మ్యాచ్‌లు) -

ఎంఎస్ ధోని: 11,207 పరుగులు (332 మ్యాచ్‌లు) -

మహ్మద్ అజారుద్దీన్: 8,095 పరుగులు (221 మ్యాచ్‌లు) -

సౌరవ్ గంగూలీ: 7,643 పరుగులు (195 మ్యాచ్‌లు) -

రోహిత్ శర్మ: 5,013 పరుగులు (122 మ్యాచ్‌లు)

 

రోహిత్ శర్మ కెరీర్ 

రోహిత్ శర్మ ఇప్పటివరకు భారత్‌కు 478 మ్యాచ్‌లు ఆడి 19,011 పరుగులు చేశాడు. రోహిత్ 157 టీ20 మ్యాచుల్లో 4,165 పరుగులు చేశాడు. వన్డేల్లో 262 మ్యాచ్‌లు ఆడి 10,709 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్ 59 మ్యాచ్‌ల్లో 4,137 పరుగులు చేశాడు.