Ind Vs Eng 1st Test Day 4 Live Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. సోమవారం నాలుగోరోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ (227 బంతుల్లో 120 బ్యాటింగ్, 15 పోర్లు), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (140 బంతుల్లో 118, 15 ఫోర్లు, 3 సిక్సర్లు)తో సత్తా చాటడంతో టీ విరామానికి 4 వికెట్లకు 298 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్ తోపాటు కరుణ్ నాయర్ (4 బ్యాటింగ్) ఉన్నాడు. దీంతో ఓవరాల్ గా 304 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ కు మరో రోజు మాత్రమే ఉండటంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లేదా, ఫలితం భారత్ పక్షానా వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
పంత్ డబుల్..భారత రెండో ఇన్నింగ్స్ లో పంత్ ఆటే హైలెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ లో వరుసగా రెండో సెంచరీతో సత్తా చాటాడు. సోమవారం ఆట ప్రారంభంలోనే కెప్టెన్ శుభమాన్ గిల్ (8) వికెట్ కోల్పోయి కాస్త కష్టాల్లో పడిన సమయంలో.. పంత్ జట్టును ఆదుకున్నాడు. రాహుల్ తో కలిసి నాలుగో వికెట్ కు 195 పరుగులు జోడించి, జట్టు బ్యాటింగ్ ను కుదుటపరిచాడు. ఈ భాగస్వామ్యంతో టెస్టులో ఇండియా డ్రైవింగ్ సీట్ లోకి వచ్చింది. అంతకుముందు ఆరంభంలోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రాహుల్.. నెమ్మదిగా ఆడుతూ సెంచరీ వైపు దూసుకెళ్లాడు. ఇక మరో ఎండ్ లో పంత్.. తన దైన శైలిలో ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ కమ్రంలో లంచ్ విరామం వరకు మరో వికెట్ పడకుండా పెవిలియన్ కు వెళ్లారు.
ఫస్ట్ రాహుల్.. ఆ తర్వాత పంత్..లంచ్ విరామం తర్వాత కాస్త జోరు పెంచిన రాహుల్ చూడచక్కని బౌండరీలు సాధించాడు. మధ్యలో హేరీ బ్రూక్ క్యాచ్ వదిలి వేయడం కూడా రాహుల్ కు కలిసొచ్చింది. పంత్ కూడా దూకుడుగా ఆడి 83 బంతుల్లో ఫిఫ్టీ చేసి, ఇంగ్లీష్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. మరో ఎండ్ లో సాధికారికంగా ఆడిన రాహుల్..202 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్ సెంచరీకి సమీపించేలోపల అతని వెనకాలే వచ్చిన పంత్.. 130 బంతుల్లో శతకం బాదాడు. దీంతో రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ కొట్టిన రెండో వికెట్ కీపర్ బ్యాటర్ గా పంత్ రికార్డులకెక్కాడు. గతంలో ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అలాగే ఇండియా తరపున ఎక్కువ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డులకెక్కాడు. ఇది తన కెరీర్లో ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. అలాగే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీ చేసిన ఏడో భారత క్రికెటర్ గా అరుదైన జాబితాలో నిలిచాడు. ప్రస్తుతం 304 పరుగుల ఆధిక్యంలో నిలిచిన భారత్.. మరో వందకు పైగా పరుగులు జోడించి, ప్రత్యర్థికి బ్యాటింగ్ కు ఆహ్వానించే అవకాశముంది.