Rishabh Pant Health:


టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ పునరాగమనానికి చాలా సమయం పట్టనుంది. లిగమెంట్ల గాయాల నుంచి కోలుకొనేందుకు రెండు సర్జరీలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిసింది. మొదట వాపులు తగ్గితేనే గానీ చికిత్స కొనసాగించేందుకు వీలవ్వదని వైద్యులు చెబుతున్నారు. అందుకే అతడిని ముంబయిలోని ఆస్పత్రికి తరలించామని బీసీసీఐ వెల్లడించింది.


రూర్కీ ప్రమాదంలో రిషభ్ పంత్‌ గాయపడ్డ సంగతి తెలిసిందే. తలకు రెండు గాట్లతో పాటు మోకాలిలోని లిగమెంట్లలో చీలిక వచ్చింది. వీటి నుంచి పూర్తిగా కోలుకొనేందుకు కనీసం తొమ్మిది నెలలు పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. డెహ్రాడూన్‌లో అతడిని పరామర్శించేందుకు ఎక్కువ మంది వస్తున్నారు. వారిని నియంత్రించేందుకు వీలవ్వడం లేదు. పంత్‌కు విశ్రాంతి తీసుకోవడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే ముంబయిలోని కోకిలా బెన్‌ ఆస్పత్రికి అతడిని ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. కాస్త కోలుకున్న తర్వాత డబుల్‌ సర్జరీ కోసం అతడిని లండన్ తీసుకెళ్తారని సమాచారం. అప్పటి వరకు దిన్షా పార్ధివాలా వైద్యబృందం అతడిని పర్యవేక్షిస్తుంది.


'రిషభ్ పంత్‌పై అటెన్షన్‌ తగ్గేందుకే ముంబయికి తీసుకొచ్చాం. అతడికి విశ్రాంతి అవసరం. డెహ్రాడూన్‌లో అది సాధ్యమవ్వదు. ఇక్కడైతే అతడికి భద్రత లభిస్తుంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కలవగలరు. గాయాల నుంచి కాస్త కోలుకుంటే లిగమెంటు శస్త్రచికిత్స గురించి వైద్యులు ఆలోచిస్తారు' అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌కు తెలిపారు. 'అతడికి ప్రయాణించే శక్తి లభిస్తే శస్త్రచికిత్స కోసం లండన్‌ పంపిస్తాం. రికవరీకి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేం. ముందు వాపు తగ్గితే పార్ధివాలా బృందం చికిత్స గురించి ఆలోచిస్తుంది. ఇప్పటికైతే పంత్‌కు మోకాలు, కాలి మడమలో శస్త్రచికిత్స అవసరం. అంటే కనీసం తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరమవ్వక తప్పదు' అని ఆ అధికారి వెల్లడించారు.


'రిషభ్ పంత్‌ పునరాగమనం గురించి బీసీసీఐ ఆలోచించడం లేదు. అతడు కోలుకోవడం పైనే దృష్టి సారించింది. రికవరీ తర్వాత అతడు రిహబిలిటేషన్‌కు వస్తాడు. ఇందుకు సుదీర్ఘ సమయం పడుతుంది. అతడు 100 శాతం కోలుకుంటే పునరాగమనం గురించి ప్రకటిస్తాం. బీసీసీఐ అతడికి అండగా ఉంటుంది' అని ఆ అధికారి తెలిపారు.